ఉనా దాడికి ఏడాది... దేశంలో దళితులకు న్యాయంజరిగేనా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఉనా దాడికి ఏడాది… దేశంలో దళితులకు న్యాయంజరిగేనా ?

July 13, 2017

గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లా ఉనాలో నాలుగురు దళిత యువకులను కారుకుకట్టేసి… పోలీసు స్టేషన్‌ సాక్షిగా.. చితకబాదిన ఘటన జరిగి ఏడాది గడిచింది. దాడి జరిగిన తర్వాత…దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన‌ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేస్తానని, 60 రోజుల్లో తీర్పు వస్తుందని వాగ్దానం చేశారు. ఏడాది గడిచిపోయింది. కోర్టును ఏర్పాటుచేయలేదు. సమీప జునాగఢ్‌లో వున్న అట్రాసిటీ కోర్టుకు కూడా కేసును బదిలీచేయలేదు. 12 మంది నిందితులకు బెయిల్‌ వచ్చింది. మిగిలిన వారికి కూడా త్వరలో బెయిల్‌ రానుంది. అయితే బాధితులు మాత్రం ఇప్పటికీ మానని గాయాలతో హింసలు అనుభవిస్తున్నారు.

చనిపోయిన ఆవు చర్మం ఒలిచారన్న కారణంతో గతేడాది జులై 11న గో రక్షణ దళాలు ఉనాకు సమీపంలోని మోటా సమాధియాల్‌ గ్రామంలో దళితుడైన బాలు సర్వైవా ఇంట్లోకి చొరబడి ఏడుగురిపై దాడికి తెగబడ్డారు. బాలు సహా అతని భార్య కున్వర్‌, అతని కొడుకులు వస్రామ్‌, రమేశ్‌, అతని బంధువులు అశోక్‌, బెచ్చార్‌లను తీవ్రంగా కొట్టారు. వారిని కాపాడేందుకు వచ్చిన దేవర్షి భానుపై సైతం గోరక్షణ దళాలు దాడి చేశాయి. అనంతరం రమేశ్‌, వస్రామ్‌, అశోక్‌, బెచ్చార్‌లను కారుకు కట్టేసి 25 కిలో మీటర్ల దూరంలోని ఉనాకు ఈడ్చుకెళ్ళారు. ఈ ఘటన సర్వైవా కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికీ మానని ఆ గాయాలు ఘటన తాలూకూ జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే ఉన్నాయి.

ʹనా చెవి నొప్పి నయం కావడంలేదు. నేను కనీసం వారానికొకసారి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాల్సి వస్తోంది. నా ఎడమ చెవి డ్రమ్‌ చిల్లులుపడిందని వైద్యులు చెప్పారు. నా రెండు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. సంవత్సరమైనా నొప్పి తగ్గడంలేదు. సరిగ్గా నడవను కూడా నడవలేకపోతున్నాను. తరతరాలుగా మా కుటుంబం చనిపోయిన పశువుల చర్మం ఒలిచి జీవనం సాగించేది. ఈ ఘటన తర్వాత మేము ఆ వృత్తిని వదిలేశాం. నేను రోజు కూలీగా పనిచేస్తున్నాను. కానీ, మానని ఆ దెబ్బలతో కూలి పనీ సరిగా చేయలేకపోతున్నానుʹ అని కారుకు కట్టేసి ఈడ్చుకెళ్ళిన నలుగురు బాధితుల్లో 25 ఏండ్ల వప్రామ్‌ చెప్పారు.

అతడికి మూడేండ్ల క్రితం వివాహమైంది. తండ్రికి సహకరించేందుకు చదువు మానేశాడు. ʹమాది పెద్ద కుటుంబం. పదోతరగతి పాసైన తర్వాత కుటుంబ పోషణలో తండ్రికి సహకరించేందుకు చదువుమానేశాను. దాడి జరిగిన తర్వాత ఆస్పత్రి – ఇంటి మధ్యే నా జీవితం గడిచిపోతోందిʹ అని వప్రామ్‌ వాపోయాడు.
గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా గిర్‌ధర్‌వాసి బెచార్‌ (28) ఉద్యోగం వెతుకులాటలో ఉనాకు వచ్చాడు. ఉద్యోగం దొరకక చనిపోయిన పశువుల చర్మం ఒలుస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ పనికి అతనికి రోజుకు రూ. 100 వచ్చేది. దాడిలో అతడి కాళ్ళకు, తలకు గాయాలయ్యాయి. సంవత్సరం గడిచిన తర్వాత కూడా అతడు సొంతంగా నడవలేకపోతున్నాడు. అతని మానసిక స్థితి కూడా స్థిరంగా ఉండటంలేదు. కొద్ది రోజుల నుంచి మాట కూడా సరిగా రావడంలేదు. బెచార్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో.. కుటుంబ జీవనం దుర్భరమైంది. ఇద్దరు పిల్లలు. కూలి పని చేసుకుంటూ కుటుంబ బాధ్యతను ఇప్పుడు భార్యే మోస్తోంది.

అనారోగ్యంతో ఉన్న అతడిని ఒంటరిగా వదిలేయలేక తను పనిచేసే పొలాల్లోకి భర్తను కూడా వెంటపెట్టుకుని వెళ్ళాల్సి వస్తోంది. ʹకానీ… ఆమె ఆదాయం ఆ కుటుంబానికి ఏ మాత్రమే సరిపోదు. సరైన చికిత్స ఇక అందని ద్రాక్షగానే ఉందిʹ అని వస్రామ్‌ చెప్పాడు.దాడి బాధితుల్లో వయస్సురీత్యా చిన్నవాడు వస్రామ్‌ సోదరుడు అశోక్‌. అతని వయస్సు 17 ఏండ్లు. గోరక్షకుల దాడిలో అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి కడుపు చిట్లిపోయింది. చికిత్స చేసినప్పటికీ… నిరంతరం కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దాడి జరిగినప్పటి నుంచి మంచం మీదే ఉంటున్నాడు.

ʹదాడి ప్రభావం అశోక్‌పై తీవ్రంగా ఉంది. ఆ ఘటన నుంచి తెరుకోలేకపోతున్నాడు. నిద్రలో అరుస్తున్నాడు. వణుకుతున్నాడుʹ అని అశోక్‌ సోదరుడు జిట్టూ చెప్పాడు. బాలు అతని భార్య కున్వర్‌లు కూడా గో గూండాల దాడిలో గాయపడ్డారు. బాలుకు తలపై ఏడు కుట్లుపడ్డాయి. భర్త, కొడుకులపై దాడి జరుగుతుంటే కున్వర్‌ అడ్డుకోబోయింది. ఆమెను వారు తోసిపడేశారు. ఆమె చీరను సైతం లాగేశారు. నోరు విప్పితే… లైంగికదాడికి పాల్పడతామని దుండగలు ఆమెను బెదిరించారు.

భౌతికంగా కోలుకున్న ఏకైక బాధితుడు రమేశ్‌. దళితులకు శిక్షణనిస్తున్న ʹదళిత్‌ శక్తి కేంద్రʹకు ట్రైనింగ్‌కు వెళ్ళాడు. మూడు నెలలపాటు అక్కడ లరింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. రమేశ్‌ టైలర్‌గా ఇప్పుడు జీవనం సాగిస్తున్నాడు.దాడిలో గాయపడిన మరో వ్యక్తి భాను. ఏడుగురిలో బేడియా గ్రామానికి చెందిన భాను సర్వైవా కుటుంబానికి చెందినవాడు కాదు. బేడియా గ్రామం నుంచి చనిపోయిన ఆవును సర్వైవా తెచ్చాడు. ʹఆ రోజు మమ్మల్ని రక్షించేందుకు భాను ప్రయత్నించాడు. కానీ, గో రక్షకులు అతన్నీ కొట్టారు. ఆ తర్వాత అతను మా కుటుంబానికి చెందినవాడు కాదని తెలుసుకుని అతన్ని వదిలేశారుʹ అని వాస్రమ్‌ గుర్తుచేసుకున్నాడు.దాడితో సర్వైవా కుటుంబం ఛిద్రమైంది. గతంలో కొద్దో గొప్పో సంపాదించి కుటుంబ జీవనాన్ని సాగించే ఆ కుటుంబానికి ఇప్పుడు వైద్య ఖర్చులు తోడయ్యాయి.

ʹదాడి జరిగిన తర్వాత… తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ రాజ్‌కోట్‌లో ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేస్తానని, 60 రోజుల్లో తీర్పు వస్తుందని ఆమె వాగ్దానం చేశారు. ఏడాది గడిచిపోయింది. కోర్టును ఏర్పాటుచేయలేదు. సమీప జునాగఢ్‌లో వున్న అట్రాసిటీ కోర్టుకు కూడా కేసును బదిలీచేయలేదు. ఉనాలోని సెషన్స్‌ కోర్టు నిందితులకు బెయిల్‌ నిరాకరించడంతో వారు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. 12 మందికి బెయిల్‌ వచ్చింది. మిగిలిన వారికి కూడా త్వరలో బెయిల్‌ రానుందిʹ అని బాధిత కుటుంబసభ్యులకు న్యాయపోరాటంలో సహాయం అందిస్తున్న దళిత ఉద్యమ కార్యకర్త జయంతి మకాదియా చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో తమకు న్యాయం జరుగుతుందని ఎవరైనా ఎలా ఆశిస్తారు? అసలు ఈ దేశంలో దళితులకు న్యాయం జరిగేనా ?

 

SOURCE : AVANINEWS