హార్ట్ ఎటాక్..ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వరుస గుండె పోటులుతో ఆరోగ్యవంతులైన వారు క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. డ్యాన్స్ చేస్తుండగా, జిమ్‌లో, పనిలో ఉండగా అక్కడికక్కడే కుప్పకూలుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఇదే పరిస్థితి. తాజాగా మరో గుండె ఆగిపోయింది. ఈ సారి డీజే సౌండ్లకు పెళ్లికుమారుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
కాసేపట్లో వివాహాం, బంధు, మిత్రులతో వివాహ వేదికగా సందడిగా మారింది. వరుడు,వధువులు చక్కగా పెళ్లి కోసం ముస్తాభయ్యారు. కాసేపట్లోనే వధువు మెడలో మూడు ముళ్లు పడనున్నాయి. దండలు మార్పిడి కూడా జరిగిపోయింది. ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇంతలోనే అనుకోని విషాదంతో కళ్యాణ వేదిక ఒక్కసారిగా మూగబోయింది. అపరిమిత డీజే సౌండ్ ను తట్టుకోలేక పెళ్లి కుమారుడు సురేంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లా మణితార గ్రామంలో చోటుచేసుకుంది.
పెళ్లికుమారుడు ఎన్నిసార్లు వేడుకున్నా డీజే సౌండ్ తగ్గించలేదు. గుండెలు ఆగిపోయే అంతా సౌండ్ పెట్టి నృత్యాల్లో మునిగితేలారు. ఫలితంగా పెళ్లికుమారుడు చనిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ వేడుకల్లో డీజే నిషేధంపై దృష్టిసారించారు.