Uncle Entra.. Uncle.. Cases will be filed: Dust on Brahmaji’s tweet
mictv telugu

అంకుల్ అంటే కేసు వేస్తా.. జాగ్రత్త.. బ్రహ్మాజీ వార్నింగ్

August 31, 2022

టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిమానులతో, తోటి నటులతో ఎంతో చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా మరోసారి బ్రహ్మాజీ తన చమత్కారాన్ని చూపించాడు. మంగళవారం సాయంత్రం ట్విట్టర్‌లో తన సెల్ఫీను పోస్ట్‌ చేస్తూ ‘ఏం జరుగుతోంది?’ అని ఫ్యాన్స్‌ను అడిగారు. ‘ఏం లేదు అంకుల్‌’ అని ఓ నెటిజన్‌/అభిమాని బ్రహ్మాజీకి రిప్లై ఇచ్చారు. సదరు ట్వీట్‌ను బ్రహ్మాజీ రీట్వీట్‌ చేస్తూ ‘అంకుల్‌ ఏంటి? అంకుల్‌. కేసు వేస్తా. బాడీ షేమింగ్‌ చేస్తున్నావా?’ అని స్మైలీ ఎమోజీ యాడ్ చేశారు. ఆయన ఇలా అనడమే ఆలస్యం వేల సంఖ్యలో లైక్స్‌, రీట్వీట్స్‌, వందల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తాయి.

ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘#SayNotToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్‌ మర్చిపోయారు అంకుల్’ అని మరొకరు.. ఇలా కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. కాగా, తనను ఆంటీ అని సంబోధించిన నెటిజన్లపై కేసులు పెడతానని హెచ్చరించిన ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ అన్నట్టుగానే రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అలా హెచ్చరించిన తర్వాత ట్విట్టర్‌లో ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. ఇటీవల అనసూయ ‘ఆంటీ’అనే పదంతో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానికి కౌంటర్ గా కాకపోయిన ట్రెండ్ లో ఉన్న టాపిక్ ను లాగి బ్రహ్మాజీ కొద్దిగా సెటైర్ వేసినట్లే కనిపిస్తోంది.