రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఘోరంగా పతనమైన కాంగ్రెస్ కు కొత్త సారథి రాబోతున్నాడు.. ఎన్నికల్లో వరుస ఓటములపై.. ముఖ్యంగా నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డంపై గుర్రుగా ఉన్న అధిష్టానం ప్రస్తుత పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డిని పక్కనపెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ స్థానాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భర్తీ చేయాలనుకున్నట్టు సమాచారం.
ఉండవల్లి ఇటీవల చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేకున్నా ఆయా రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించి ఏపీ బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం యత్నిస్తోంది. ఈ దిశగా దూతలను ఆయన వద్దకు పంపి చర్చలు జరపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అయితే ఆయన వైకాపాలో చేరే అవకాశాలూ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఏపీ విభజన తర్వాత ఉండవల్లి.. మాజీ సీఎం కిరణ్ కమార్ తో వెళ్లారు.
కిరణ్ పార్టీ అడ్రస్ లేకుండా పోయినప్పటి నుంచి ఉండవల్లి ఏ పార్టీలోనూ చేరలేదు. ఏపీలో టీడీపీ, వైకాపాల మధ్య ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ను ఎవరూ కాపాడలేరని, ఆ పార్టీ దాదాపు కనుమరుగైనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. రఘువీరారెడ్డి పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నప్పటికీ మంచి ఫలితాలు రావడం లేదని, ఆయన బదులు మరొకరికి బాధ్యలు కట్టబడి పరీక్షించి చూడాలని అధిష్టాంన యోచిస్తున్నట్లు కనిపిస్తోంది..