Understand..Give us those villages: Puvwada
mictv telugu

అర్థం చేసుకోండి..ఆ గ్రామాలను మాకు ఇవ్వండి: పువ్వాడ

July 20, 2022

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూమార్ ఏపీ మంత్రులకు, కేంద్ర మంత్రులకు మంగళవారం  మీడియా సముఖంగా ఓ విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి ఆలయాన్ని కాపాడుకోవడానికి, అక్కడ నివసిస్తున్న పేదలను రక్షించుకోవడానికి కరకట్ట సహా ఇతర నిర్మాణాలను చేపట్టడానికి ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల అనే ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు. దయచేసి ఈ విషయంలో ఏపీ మంత్రులు, కేంద్ర మంత్రులు అర్థం చేసుకోవాలని కోరారు. ఎందుకంటే.. భద్రాచలం క్షేత్రాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి, అవసరమైన నిర్మాణాలు చేపట్టడానికి పట్టణం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇస్తే, అది సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.

అజయ్ కుమార్ మాట్లాడుతూ..”కేంద్ర ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నాం. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం సీతారామాలయంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జనావాసాలు ముంపునకు గురవటం బాధాకరం. భద్రాచలంలో గోదావరికి ఇరువైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకొనేందుకు కేసీఆర్ ఎంతో ఆర్ద్రతతో, ఉదారంగా రూ.1000 కోట్లను ప్రకటించారు. అందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా, భద్రాద్రి ఆలయాన్ని, అక్కడి పేదలను కాపాడుకోవడానికి కరకట్ట సహా ఇతర నిర్మాణాలను చేపట్టడానికి ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాలను తెలంగాణలో కలపండి. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఐదు గ్రామాలతోపాటు ఏడు మండలాలను ఏపీలో కలిపారు. భద్రాచలం వరద బాధితుల ఆవేదనను అర్థం చేసుకోండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్పందించి వరద బాధితులను ఆదుకోవాలి” అని ఆయన అన్నారు.