దేశంలో పనిలేదు.. ప్రతి నలుగురిలో ఒకరు ఖాళీ..  - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో పనిలేదు.. ప్రతి నలుగురిలో ఒకరు ఖాళీ.. 

January 21, 2020

thuji

దేశంలో నిరుద్యోగం తారస్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగానూ ఈ సమస్య ఉధృతరూపంలో దాలుస్తోంది. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ సమస్యత తీవ్రంగా ఉంది. చదువుకున్నోళ్లు కొలువు లేక కుటుంబాలకు భారంగా మారుతున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఎఐ)  గత త్రైమాసికం( సెప్టెంబర్ – డిసెంబర్) దేశలో ఉద్యోగాల స్థితిగతులను అంచనా వేసి నివేదిక సమర్పించింది. 1.74 లక్షల ఇళ్ల నుంచి సమాచారం సేకరించి దీన్ని రూపొందించారు. 

ముఖ్యాంశాలు.. 

  1. గత త్రైమాసికంలో దేశంలో నిరుద్యోగం 7.5 శాతానికి పెరిగింది. విద్యావంతుల్లో ఇది ఏకంగా 60 శాతం చేరుకుంది. 
  2. 2019 సంవత్సరం నిరుద్యోగ యువతకు శాపంలా మారింది. 2017 మే – ఆగస్టు మధ్య నిరుద్యోగ రేటు 3.8 శాతంగా కాగా, అప్పట్నుంచీ పెరుగుతూ రెట్టింపుకు చేరుకుంది.  
  3. గత త్రైమాసికంలో గ్రామీణ భారతంలో నిరుద్యోగ  రేటు 66 శాతంగా ఉంది. 
  4. పట్టణాల్లోని విద్యావంతులైన యువతీయువకుల్లో నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. 20-24 వయస్సు వారిలో ఇది  ఊరంగా 37 శాతంగా రికార్డైంది. వీరిలో గ్రాడ్యుయేట్లు 60 శాతంపైగే ఉన్నారు. 2019లో పట్టణ యువత సగటు నిరుద్యోగిత  63.4 శాతం కాగా, గత మూడేళ్లలో ఇదే అత్యధికం. 
  5. 20-24 మధ్య ఉన్న యువతకు సరైన ఉద్యోగాలు లేవు.  గ్రాడ్యుయేట్లలో ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగంలేక ఇబ్బంది పడుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇలా.. 

2019లో ప్రపంచ నిరుద్యోగుల ఖాతాలో 18.8 కోట్ల మంది కొత్తగా చేరారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజా నివేదిక ప్రకారం.. మొత్తం నిరుద్యోగుల  5.4 శాతంగా నమోదైంది. 28.5 కోట్ల మందికి చక్కని అర్హతలు ఉన్నా.. చిన్నాచితకా పనులు చేసుకుంటున్నారు. 50 కోట్ల మంది కార్మికులకు సరైన జీతాలులేవు. ఫలితంగా గత పదేళ్లలోసమ్మెలు, ఆందోళనలు పెరిగాయి.