Home > Featured > జేపీ నడ్డాకు సమాధి.. ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతోనే..

జేపీ నడ్డాకు సమాధి.. ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతోనే..

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో ఏ రోజుకారోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రికి రాత్రే వెలిసిన సమాధి తీవ్ర దుమారం రేపుతోంది. జేపీ నడ్డాకు సమాధి కట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2016 సమయంలో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న జగత్ ప్రకాష్ నడ్డా మర్రిగూడలో పర్యటించారు. ప్రజలకు ఆనాడు చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం అదే ఏడాది చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే నడ్డా హామీ ఇచ్చి ఆరేళ్లు గడిచినా ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ రాలేదు. ఈ విషయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా రీసెర్చ్ సెంటర్ కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే జేపీ నడ్డా సమాధి వెలిసింది. ఫ్లోరెడ్ బాధితులే ఇలా నిరసన తెలిపారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టడంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. అధికార పార్టీ నేతలే సమాధి కట్టారని.. ఫ్లోరెడ్ బాధితులతో సంబంధం లేదంటున్నారు. మునుగోడులో బీజేపీకి వస్తున్న ఆదరణతో ఓటమి ఖాయమని గ్రహించిన టీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు

Updated : 19 Oct 2022 11:26 PM GMT
Tags:    
Next Story
Share it
Top