Unidentified woman's body found In Plastic Drum At Raily Station In Bengaluru,3rd incident in 3 months
mictv telugu

రైల్వే స్టేషన్‌లో కలకలం.. ప్లాస్టిక్ డ్రమ్ములో మహిళ మృతదేహం

March 14, 2023

కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్లాస్టిక్ డ్రమ్ములో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు ఆ మహిళ మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి బయ్యప్పనహల్లి రోడ్డులోని ఎస్ఎమ్వీటీ రైల్వే స్టేషన్లో వదిలి వెళ్లారు. ఆ ముగ్గురు డ్రమ్మును తీసుకొస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బయ్యప్పనహల్లి రోడ్డులోని ఎస్ఎమ్వీటీ రైల్వే స్టేషన్ ప్రధాన గేటు వద్ద ఆటో దిగారు. ఆటో నుంచి నీలం రంగు డ్రమ్మును తీసి స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వదిలి వెళ్లారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

ఆ డ్రమ్ములో నుంచి దుర్వాసన రావడం వల్ల ప్రయాణీకులు.. పోలీసులకు సమాచారం అందించారు. ‘సంఘటనా స్థలి నుంచి సోమవారం రాత్రి 7:30 నిమిషాలకు మాకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. అనంతరం డెడ్బాడీని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. మృతి చెందిన మహిళకు వయసు సుమారు 30 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నాం. నిందితులను గుర్తించేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాం. విచారణ కొనసాగుతోంది’ అని రైల్వే ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు.

రెండు నెలల క్రితం కూడా అచ్చం ఇలాంటి ఘటనే బెంగుళూరులో వెలుగు చూసింది. ఈ ఏడాది జనవరిలో యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్పై ఇలాగే మృతదేహంతో కూడిన డ్రమ్ము బయటపడింది. అది మరవకముందే రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ అలాంటి సంఘటనే జరిగిన నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.