Union Cabinet approves policy on long-term leasing of Railways' land
mictv telugu

రైల్వే స్థలాలను లీజుకు ఇస్తున్న మోడీ ప్రభుత్వం.. కేబినెట్ కీలక నిర్ణయం

September 7, 2022

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో బుధ‌వారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. భార‌తీయ రైల్వేల‌కు చెందిన స్థ‌లాల‌ను లీజుకు ఇచ్చే విష‌యంపై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టిదాకా రైల్వే స్థ‌లాల‌ను లీజుకు ఇచ్చే అవ‌కాశ‌మే లేక‌పోగా… తాజాగా ఈ స్థ‌లాల‌ను ప్రైవేట్ వ్య‌క్తులు లీజుకు తీసుకునే వెసులుబాటు ల‌భించింది. రైల్వే భూముల విధానాన్ని సవరించి, రైల్వే భూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించారు. కౌలు కాలాన్ని కూడా ఐదేళ్ళ నుంచి 35 ఏళ్ళకు పెంచారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వివరాలను మీడియాకు తెలిపారు.

రానున్న ఐదేళ్ళలో 300కు పైగా గతి శక్తి కార్గో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాలని, రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీ (LLF)ను 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. నూతన విధానం వల్ల కొత్తగా దాదాపు 1.2 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు రైల్వేలు కూడా మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతాయని తెలిపారు. భూమి లీజు కాలాన్ని పెంచడం వల్ల మరిన్ని కార్గో టెర్మినల్స్ నిర్మాణానికి, ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ మరింత ఆకర్షణీయం అవుతుందన్నారు.