అగ్రవర్ణ కేబినెట్! - MicTv.in - Telugu News
mictv telugu

అగ్రవర్ణ కేబినెట్!

September 5, 2017

దేశంలో కుల వివక్ష ఏమాత్రం పోలేదని చెప్పడానికి కేంద్ర కేబినెట్ కు మించిన చక్కని ఉదారహరణ మరొకటి లేదు. ప్రధానమంత్రి మోదీ.. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. అచ్చేదిన్.. ’ అని ఎన్ని కబుర్లు చెప్పినా అందలాలు, అభివృద్ధి ఫలాలు దక్కుతున్నది మాత్రం అగ్రవర్ణాలకే అని తేలిపోతోంది. ఎస్సీ, ఎస్టీ వంటి అణగారిన వర్గాలకే కాదు.. మోదీ సామాజిక వర్గమైన ఓబీసీలకు(ఆయన అగ్రవర్ణం వాడేనన్న వాదన కూడా ఉంది) కూడా అధికార విషయంలో మొండి చెయ్యే ఎదురవుతోంది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో అయినా ఈ వర్గాలకు ప్రాధాన్యం లభిస్తుందని పెట్టుకున్న ఆశ అడియాసే అయింది.

కేంద్ర మంత్రి వర్గంలో కేబినెట్ హోదా స్థాయి మంత్రులకు చాలా ప్రధాన్యం ఉంటుంది. వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి పదవుల్లో కులాలు, ప్రాంతాల మధ్య సమతూకం ఉండాలి. కానీ అంతా విరుద్ధం. కేబినెట్ మంత్రులో అత్యధికులు బ్రాహ్మణులే. తర్వాత స్థానంలో క్షత్రియులు ఉన్నారు. ఈ కింది చిట్టా చూడండి..

కేబినెట్ మంత్రులు మొత్తం 27 మంది. వీరిలో బ్రాహ్మణులు ఏకంగా 8 మంది. క్షత్రియులు ఐదుగురు వైశ్యులు ఇద్దరు, ఓబీసీలు ఇద్దరు ఉన్నారు. ఎస్సీ ఇద్దరంటే ఇద్దరు కాగా, ఒక ఎస్టీ ఉన్నారు. మస్లిం కూడా ఒక్కరే.

దేశంలో 14 శాతంగా ఉన్న ముస్లింలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒక్కరు. కేబినెట్ మంత్రుల లెక్క ప్రకారం (27)తీసుకుంటే.. జనాభా ప్రాతిపదిక ముస్లింలకు దాదుపు మూడు సీట్లు ఉండాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఓసీసీలు 41 శాతం. ఈ లెక్కన కేబినెట్ మంత్రులు సగం మంది.. అంటే 13 మంది ఓబీసీలు ఉండాలి. కానీ అంతా వ్యతిరేకంగానే సాగింది. ఎస్సీ, ఎస్టీ ఇతర మైనారిటీల విషయంలోనూ అన్యాయమే జరిగింది. 20 శాతమున్న ఎస్సీలకు దాదాపు ఆరు పోస్టులు, పది శాతం జనాభా ఉన్న ఎస్టీలకు మూడు పోస్టులు దక్కాలి. కానీ అంతా వ్యతిరేకంగా సాగిపోతోంది. ఇక లాభపడింది బ్రాహ్మణులు, క్షత్రియుల వంటి అగ్రవర్ణాలు మాత్రమే. దేశ జనాభాలో 6 శాతంగా ఉన్న బ్రాహ్మణులుకు వారి జనాభా ప్రకారం అయితే కేబినెట్ లో ఒకటిన్నర పోస్టు ఉండాలి. ఒకటిన్నర.. సాధ్యం కాదనుకంటే పోనీ రెండు పోస్టులు ఉండాలి. కానీ ఏకంగా 8 మంది ఉన్నారు. అంటే 300 శాతం ఎక్కువ లబ్ది పొందుతున్నారు.

కేబినెట్ మంత్రుల తర్వాతి హోదాలోకి వచ్చే స్వతంత్ర హోదా, సహాయ మంత్రుల్లో ఓబీసీకు కాస్త చోటు దక్కినా ఇతర అణగారిన వర్గాలు మాత్రం అన్యాయమే జరుగుతోంది.

దక్షిణాదికి అన్యాయం..

దక్షిణ భారతదేశానికి కేంద్ర కేబినెట్ లో సరైన ప్రాతినిధ్యమే లేదు. దక్షిణాది రాష్ట్రాల జనాభా దేశ జనాభాలో దాదాపు 20 శాతం వరకు ఉంది(30 కోట్లు). ఈ లెక్కన కేబిటెన్ హాదా మంత్రుల్లో దాదాపు ఆరగురు మంత్రులు దక్షిణాది వారు ఉండాలి. కానీ నలుగురు మాత్రమే ఉన్నారు(నిర్మాలా సీతారామన్, అనంత్ కుమార్ హెగ్డే, అశోక్ గజపతిరాజు, సదానంద గౌడ). దేశ జనాభాలో సగం ఉన్న మహిళలకు కూడా సరైన ప్రాతినిధ్యం దక్కలేదు. కేబినెట్ హోదా మంత్రుల్లో ఆరుగురు మాత్రమే మహిళలు.

ఇలా అన్ని అణగారిన వర్గాలకు కేబినెట్ లో అన్యాయమే జరుగుతోంది. చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నట్లు.. కేబినెట్ పోస్టుల్లోనూ రిజర్వేషన్లు ఉంటే సమస్య కొంతవరకైనా పరిష్కారం అవుతుంది. ప్రతిభే కేబినెట్ పోస్టుకు కొలమానం అనుకుంటే ప్రస్తుతం కేబినెట్ మంత్రుల్లో చాలామంది వెంటనే పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుంది. కేబినెట్ కూర్పులకు అధికార పార్టీ బలం, కోటరీలు, ప్రధానమంత్రి ఇష్టాయిష్టాలు కులపిచ్చి వంటివి తప్ప మరొకటి కొలమానం కాని పరిస్థితుల్లో జనాభా ఆధారంగా ప్రాతినిధ్యం కోరడం అత్యాశేనంటారా?