Union Finance Minister Nirmala Sitharaman ordered to crack down on illegal loan apps
mictv telugu

రుణ యాప్‌లపై కేంద్రం కీలక నిర్ణయం.. వైట్ జాబితాకు ఆదేశం

September 9, 2022

Union Finance Minister Nirmala Sitharaman ordered to crack down on illegal loan apps

లోన్ యాప్‌ల దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలను టార్గెట్ చేసి వారిని వేధిస్తున్న యాప్‌లపై కేంద్రం కన్నెర్ర చేసింది. అలాంటి యాప్‌లను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐని శుక్రవారం ఆదేశించారు.

ఆర్బీఐ వద్ద రిజిస్టర్ కాని లోన్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజిస్టర్డ్ యాప్‌లు మాత్రమే ప్లే స్టోర్‌లో ఉండేలా, అనుమతి పొందిన యాప్‌లతో వైట్ జాబితా రూపొందించాలని పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయిన యాప్‌ల లిస్టు తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ యాప్‌ల ద్వారా మాత్రమే లావాదేవీలు జరగాలని వివరించారు. చాలా రుణ యాప్‌లు చైనా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ బాధితులను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు ఆర్ధిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఫేక్ యాప్‌ల విస్తరణను తనిఖీ చేసి షెల్ కంపెనీలను గుర్తించి వాటి గుర్తింపును రద్దు చేయాలని ఆదేశించింది. ఈ అంశంపై వినియోగదారులు, బ్యాంకు ఉద్యోగులు, లా ఏజెన్సీలను అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్ధిక, రెవెన్యూ, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శులు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ గవర్నర్ తదితరులు పాల్గొన్నారు.