కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ కాపీని ఆర్థిక మంత్రి చదివి వినిపిస్తున్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్. ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్-2023 ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.
కరోనా దృష్ట్యా గత రెండేళ్లుగా కాగిత రహిత బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నారు. అదే సంప్రదాయాన్ని ఈసారీ కొనసాగించారు. బడ్జెట్ ట్యాబ్‌ను ఎరుపు రంగు పౌచ్‌లో ఉంచి తీసుకొచ్చారు. ప్రజలు, ఎంపీలకు బడ్జెట్ వివరాలు అందుబాటులో ఉంచేందుకు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చారు. అంతకుముందు బడ్జెట్ ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్ బృందం పార్లమెంట్‌కు చేరుకుంది. ఉదయం కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.