కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సీఎం కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. మాపై విమర్శలు చేస్తున్నారు సరే.. మరీ మీ సంగతేమిటంటూ నిలదీశారు. ‘అమృతకాల బడ్జెట్’ అంశంపై దూరదర్శన్ న్యూస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. చేతులు జోడించి చెబుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ లకు చేరాలన్న లక్ష్యంపై జోక్‌లు వద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పులపై కేంద్రమంత్రి మాట్లాడారు. కేసీఆర్ పాలనకు ముందు తెలంగాణ రాష్ట్రం అప్పులు ఎంత? ఇప్పుడు తెలంగాణ అప్పులు ఎంత? అని ప్రశ్నించారు. 2014లో తెలంగాణకి రూ.60వేల కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు రూ.3లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాలు చేసే అప్పులను నియంత్రించే బాధ్యత రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిందని, దానినే తాము అమలు చేస్తున్నామన్నారు.
‘అప్పులపై ఎవరో ఒకరు మానీటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఆర్ఎంబీ లిమిట్ పైనా ఇప్పటికే అనేకసార్లు సమాధానం చెప్పాను. పార్లమెంట్ అనేది అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ.. అక్కడే అనేకసార్లు సమాధానం ఇచ్చాం. అందరినీ ఒకేలాగా చూస్తాం.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తాం. పథకాలను జోక్ అంటూ ప్రజలను వెక్కిరిస్తున్నారా? అంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలి. ఇది దేశం కోసం’అంటూ హితవు పలికారు.
తాము దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో.. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లను పంపాలని కేసీఆర్ సర్కారు చెప్పామని తెలిపారు. అయితే, అప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న కరీంనగర్, ఖమ్మం జిల్లాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలుగా పంపిందని మండిపడ్డారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో అనే విషయం కూడా కేసీఆర్‌కు తెలియదా? అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి డేటా సరిగా ఇవ్వలేదని.. నోడేటా అవలేబుల్ అనేది ఎవరికి వర్తిస్తుందో ఆలోచించండి అంటూ కేసీఆర్ సర్కారుకు నిర్మలా సీతారామన్ చురకలంటించారు. నంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని మాట్లాడాలని టీఆర్ఎస్ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు.