ప్రత్యేక రైళ్లలో వెళ్లాలంటే ఇవి పాటించాలి.. - Telugu News - Mic tv
mictv telugu

ప్రత్యేక రైళ్లలో వెళ్లాలంటే ఇవి పాటించాలి..

May 1, 2020

union Home Ministry allows special trains to ferry stranded migrants back home

పని కోసం, చదువు కోసం వచ్చి ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు కేంద్రప్రభుత్వం ఈరోజు శుభవార్త తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించింది. వలస కార్మికులు, విద్యార్థులు వెళ్లడం కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘శ్రామిక్‌ స్పెషల్ రైళ్ల’ను ఏర్పాటు చేస్తుందని తెలిపింది. వీటికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.

రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే ‘శ్రామిక్‌ స్పెషల్ రైళ్ల’ను రైల్వే శాఖ నడుపనుంది. వీటి సమన్వయానికి రైల్వే శాఖ, రాష్ట్రాలు సీనియర్‌ ఆఫీసర్లను నోడల్‌ అధికారులుగా నియమించాల్సి ఉంటుంది. ప్రయాణికులు రైలు ఎక్కే ముందు వారిని పంపించే రాష్ట్రాలు స్క్రీనింగ్ చేయాలి. కరోనా వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాతే రైలులోకి అనుమతించాలి. శానిటైజ్‌ చేసిన బస్సుల్లో ప్రయాణికులను బ్యాచ్‌ల వారీగా రైల్వే స్టేషన్‌కు తీసుకురావాలి. ప్రయాణికులు ముఖానికి మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ప్రయాణికులను పంపే రాష్ట్రమే వారికి భోజనం, నీళ్లు సమకూర్చాలి. ప్రయాణికులు గమ్యానికి చేరుకున్నాక సదరు రాష్ట్ర ప్రభుత్వం వారికి స్క్రీనింగ్ చేశాకే వారిని రాష్ట్రంలోకి అనుమతించాలి. కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలించాలి. రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా ఏర్పాట్లు చేయాలి.