Union Minister Anurag Thakur says to make TVs with inbuilt satellite tuner
mictv telugu

త్వరలో టీవీ సెట్‌టాప్ బాక్సులు కనుమరుగు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

February 15, 2023

Union Minister Anurag Thakur says to make TVs with inbuilt satellite tuner

టీవీ సెట్ టాప్ బాక్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం టీవీ చూడాలంటే టీవీతో పాటు విడిగా టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి ప్రైవేట్ సంస్థల సెట్ టాప్ బాక్సులను తీసుకోవాలి. దానికి ప్రతీనెలా రీచార్జ్ చేయించనిదే ప్రసారాలు రావు. కానీ కేంద్రం తీసుకుంటున్న కొత్త చర్యల వల్ల ఈ సెట్ టాప్ బాక్సుల శకం ముగియనున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు ఎలక్ట్రానిక్ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి లేఖ రాశారు. ఇక నుంచి తయారయ్యే టీవీల లోపలే ఓ శాటిలైట్ రిసీవర్‌ని అమర్చేలా ఆదేశాలివ్వాలని కోరారు.

దీని వల్ల సెట్ టాప్ బాక్సులు లేకుండానే టీవీలో ఉచితంగా 200కి పైగా ఛానెళ్లు, రేడియో ప్రసారాలను చూడవచ్చు లేదా వినవచ్చు. టీవీతో పాటు వచ్చే చిన్న యాంటెన్నాను ఇంటి పైకప్పు లేదా కిటికీలకు అమర్చుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకు ఫ్రీగా ప్రసారమయ్యే ఛానెళ్లకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. పెయిడ్ ఛానెళ్లతో పాటే ఫ్రీ ఛానెళ్లు కూడా సెట్ టాప్ బాక్సుల ద్వారా ప్రసారమయ్యేవి. ఇప్పుడు ఆ విధానానికి చెక్ పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు 55 ఛానెళ్లు విద్యా, ఉద్యోగ సమాచారం అందిస్తుండగా, అవి ఇక నుంచి కొత్తగా వచ్చే విధానంలో ఫ్రీగా చూసుకునే వీలుంది.

కరోనా సమయంలో పేద, మారుమూల ప్రాంతాల ప్రజలు క్లాసుల పరంగా పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాజా ప్రతిపాదన చేశారు. అలాగే ఫ్రీగా వచ్చే దూరదర్శన్ డిష్ వాడకం దార్ల సంఖ్య 2015తో పోలిస్తే రెట్టింపయింది. 20 మిలియన్ల నుంచి ఆ సంఖ్య 2021 నాటికి 43 మిలియన్లకు పెరగడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే దూరదర్శన్ అనలాగ్ ట్రాన్స్‌మిషన్ ప్రక్రియను దశల వారీగా నిలిపివేసే ఆలోచన ఉండడంతో డిజిటల్ శాటిలైట్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఈ ఫ్రీ టు ఎయిర్ ఛానెళ్లను ప్రసారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మార్కెట్లో డిష్ టీవీల గుత్తాధిపత్యానికి తెరపడుతుందని అత్యధికులు భావిస్తుండగా, మరికొందరు మాత్రం టెక్నాలజీ దెబ్బకు కాల గర్భంలో కలిసిపోయే జాబితాలో సెట్‌టాప్ బాక్సులు చేరనున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ప్రైవేట్ పెయిడ్ ఛానెళ్ల సంగతి ఏంటన్నదానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత రాలేదు.