‘‘తెలంగాణలో దోచుకున్నది సరిపోకనే ఢిల్లీకి వెళ్లి మందు దందా చేశారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తుంటే తెలంగాణ ప్రజలపై దాడి అని కట్టుకథలు చెబుతున్నారు. కల్వకుంట్ల కవితను ఢిల్లీ వెళ్లి మద్యం అమ్మమని తెలంగాణ ప్రజలు కోరారా? ఆమె రాష్ట్ర ప్రజలు సిగ్గు పడే చేయడమే కాక ఇప్పుడు దీక్ష పేరుతో నాటకాలు ఆడుతున్నారు’’ అని నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి. మహిళా బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ తలపెట్టిన దీక్ష, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు ఈడీ సమన్లపై బీఆర్ఎస్ విమర్శలు తదితర అంశాలపై ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు తెచ్చి మద్యం అమ్మకాలతో ప్రధాన ఆదాయంగా మార్చుకున్నారని దుమ్మెత్తి పోశారు.
ఫోన్లు ఎందుకు పగలగొట్టారు
కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంతో ఎలాంటి సంబంధమూ లేకపోతే ఆమె ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఆమె లక్షల రూపాయల సెల్ ఫోన్లను ఎందుకు పగలగొట్టారు? కవిత చేసిన అక్రమ మద్యం బిజినెస్‌తో తెలంగాణ ప్రజలకు, మహిళలకు ఏం సంబంధం? వారి కోసం ఆమె మద్యం అమ్మారా? మీరు ప్రధాని మోదీ గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు,’’ అని అన్నారు. తెలంగాణ తొలి కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకుండా ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. బిల్లును అడ్డుకున్న ఎస్పీ, ఆర్జేడీలతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఒక మహిళ రాష్ట్రపతిగా ఉన్నారని, కేబినెట్లో ఎందరో మహిళలు ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు.