కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మద్యం అలవాటు ఉన్న వ్యక్తులను..అమ్మాయిలు వివాహం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు కూడా మందుబాబులకు పిల్లనివ్వొద్దని కోరారు. మందు తాగేవాళ్లకు ఇచ్చి పెళ్లి చేయడం కంటే ఒక కూలీ లేదా రిక్షా కార్మికుడితో వివాహం జరిపించడం మంచిదని తెలిపారు. వారితో సంసారం సుఖంగా ఉంటుంది..కానీ మద్యానికి బానిసైన వాళ్లతో జీవితం నరకమని తెలిపారు. దీనికి ఉదహరణగా తమ కుటుంబంలో జరిగిన ఓ విషాద ఘటనను మంత్రి వివరించారు.
తన కుమారుడు మద్యానికి అలవాటుడ పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడని కౌశల్ కిషోర్ తెలిపారు. దీంతో తమ కోడలు వితంతువుగా మిగిలిపోయిందని..రెండేళ్ల కుమారుడు తండ్రిలేని వాడయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోలేకపోయామన్నారు. అతనిని డి-అడిక్షన్ కేంద్రంలో చేర్పించినా ఫలితం రాలేదని వాపోయారు. చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని వివరించారు. మద్యపానం చేసేవారి జీవితకాలం చాలా తక్కువ అని.. ఆ వ్యసనం కుటుంబాలపై వినాశకరమైన ప్రభావాన్ని మంత్రి నొక్కి చెప్పారు. ఈ కష్టం నుంచి తమ కుమార్తెలు, సోదరిమణులను రక్షించుకోవాలని సూచించారు. అందుచే మందుబాబులకు ఇచ్చి వివాహం చేయకపోవడమే మంచిదని స్పష్టం చేశారు.
భారత దేశంలో ప్రతీ సంవత్సరం సుమారు 20 లక్షల మంది చెడు వ్యసనాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని కౌశల్ కిషోర్ తెలిపారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న 90 ఏళ్ల భారత స్వాతంత్య్ర ఉద్యమంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన 6.32 లక్షల మంది కంటే ఇది పెద్ద సంఖ్య అని మంత్రి వ్యాఖ్యానించారు. మద్యపానంతో పాటు, పొగాకు, సిగరెట్లు మరియు బీడీలు
మరణాలకు కారణమని చెప్పారు. దాదాపు 80% క్యాన్సర్ మరణాలు ఈ పదార్ధాల వల్ల సంభవిస్తున్నాయిని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వివరించారు.
ఇవి కూడా చదవండి :
ఏపీలో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించేది ఎప్పుడంటే..
బీజేపీకి ఎదురుదెబ్బ… కొత్త పార్టీని ప్రకటించిన గాలి జనార్ధన్ రెడ్డి
గుర్రంపై ‘గడప గడపకు’ వైసీపీ ఎమ్మెల్యే