ఏపీ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రయాణీకుల కోసం చర్లపల్లి వద్ద ప్రత్యేక టెర్మినల్ నిర్మిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం విజయవాడలో మచిలీపట్నం వరకు పొడగించిన ధర్మవరం – విజయవాడ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి గతంలో కంటే 20 శాతం అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు.
మొత్తంగా రైల్వే విభాగానికి రూ. 8 వేల 600 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. యూపీఏ హయాంలో 58 కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తే మోదీ హయాంలో 350 కిలోమీటర్ల మేర లైన్లు వేశామని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు మాదిరిగా విజయవాడ రైల్వే స్టేషన్‌ని డెవలప్ చేస్తామని, డీపీఆర్ వచ్చాక పనులు మొదలెడతామని హామీ ఇచ్చారు.
అలాగే మరికొన్ని రైళ్లను పొడిగిస్తున్నట్టు తెలిపారు. విశాఖ – కాచిగూడ రైలును మహబూబ్‌నగర్ వరకు, విశాఖ – విజయవాడ రైలును గుంటూరు వరకు, నంద్యాల – కడప రైలును రేణిగుంట వరకు, విజయవాడ – హుబ్బళీ రైలును నర్సాపురం వరకు, విజయవాడ – షిర్డీ రైలును మచిలీపట్నం వరకు పొడగిస్తామని వివరించారు. అంతేకాక, తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు రాబోతోందని సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రయాణిస్తుందని వెల్లడించారు.