Union Minister Supported Moonlighting Says Companies Should Not Put Lid On Employee Dreams
mictv telugu

మూన్ లైటింగ్ జీవితంలో ఓ భాగం.. చేస్తే తప్పెంటీ.!

September 25, 2022

మూన్ లైటింగ్.. అనైతికం, మోసం అంటూ తమ సంస్థలో పనిచేస్తున్న 300 మంది తమ ఉద్యోగులను తొలగించింది విప్రో. తమ కంపెనీలో పని వేళలు ముగిసిన తర్వాత ఖాళీ సమయాల్లో ఇతర ఉద్యోగాలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదని ఆ సంస్థ చైర్మన్ రిష‌ద్ ప్రేమ్‌జీ అంటున్నారు. ఒకేసారి ఒక‌టి కంటే ఎక్కువ కంపెనీల్లో ప‌ని చేయ‌డం సంస్థ విశ్వాసాన్ని ఉల్లంఘించ‌డ‌మేన‌ని మరో ప్రముఖ కంపెనీ.. ఇన్పోసిస్ కో-ఫౌండ‌ర్ క్రిష్ గోపాల‌కృష్ణ‌న్ కూడా పేర్కొన్నారు. ఇత‌ర ఉద్యోగాలు చేసే వారితో కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం ప‌డుతుంద‌ని, దీని వల్ల డేటా ఉల్లంఘనకు పాల్పడే అవకాశముందని హెచ్చ‌రించారు.

300 మంది ఉద్యోగుల‌ను కంపెనీ నుంచి తొలగించడంతో ఐటీ రంగంలో వాడీ వేడీ చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. మూన్ లైటింగ్‌పై ఐటీ రంగ నిపుణులు రెండుగా చీలిపోయారు. ఇన్ఫోసిస్ కో-ఫౌండ‌ర్ క్రిష్ గోపాల కృష్ణ‌న్‌ మూన్ లైటింగ్ అనైతికమని చెబుతుండగా.. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్ట‌ర్ మోహ‌న్‌దాస్ పాయ్ మాత్రం మూన్ లైటింగ్ జీవితంలో ఒక భాగ‌మేనంటున్నారు. `ఒక‌వేళ నాకు అద‌న‌పు మ‌నీ అవ‌స‌రం అని భావిస్తే శ‌నివారం కూడా నేను ప‌ని చేస్తా. అలా చేయ‌కుండా న‌న్నెవ‌రూ ఆప‌లేరు` అని చెప్పారు.

అదేవిధంగా టెక్ మ‌హీంద్రా సీఈవో సీపీ గుర్నానీ సైతం మూన్ లైటింగ్‌ను స‌మ‌ర్థించారు. ఏ ఉద్యోగికైనా త‌మ శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను బ‌ట్టి అద‌న‌పు ఆదాయం సంపాదించుకునే హ‌క్కు ఉంటుంద‌న్నారు. పూర్తిగా పార‌ద‌ర్శ‌క‌త‌తో సుదీర్ఘ కాలం జ‌ర‌గాల్సిందేన‌న్నారు. కానీ ప్ర‌స్తుతానికి ఇలా జ‌రిగేలా క‌నిపించ‌డం లేద‌న్నారు. తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సైతం మూన్ లైటింగ్ కు మద్ధతు తెలిపారు. కంపెనీలు ఉద్యోగుల కలలను కొల్లగొట్టకూడదంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కంపెనీలు చేస్తున్న పని యువతను విజయవంతంగా కాకుండా ఆపడమేనన్నారు. కంపెనీలు చేస్తున్న పని వల్ల యువత సామర్థ్యం ఆగిపోతుందని, ముఖ్యంగా స్టార్టప్‌లకు వారు సాయపడరని అన్నారు. లాయర్‌గా, కన్సల్టెంట్‌ మాదిరిగా ఐటీ ఉద్యోగులు కూడా పని చేయనున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇదే ఫ్యూచర్ వర్క్ అని తెలిపారు. మరో కొసమెరుపు ఏంటంటే.. వివిధ ఐటీ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న వారిలో సుమారు 65 శాతం మంది ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ `మూన్ లైటింగ్‌`లో ప‌ని చేస్తున్నార‌ని కొట‌క్ ఇన్‌స్టిట్యూస‌న్ ఈక్విటీస్ నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింది.