పిచ్చి ముదిరి రోకలిని తలకు చుట్టమన్నాట్ట వెనకటికి ఒకడు. మన కేంద్ర పర్యాటక మంత్రి కేజే అల్ఫోన్స్ వ్యవహారం అలాగే ఉంది. దేశంలో చమురు ధరలు దారణంగా పెరిగిపోతున్నాయని జనం గగ్గోలు పెడుతోంటే ఈ అమాత్యులకు చీమకుట్టినట్లయినా లేదు. పైగా అదేం పెద్దవిషయం కాదన్నట్లు వాగాడు. ‘పెట్రోల్ ధరల పెంపు, పెంచుతున్న విధానం కరక్టే. జనం వారి స్థాయినిబట్టి పన్నులు చెల్లిస్తారనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కారు, మోటార్ బైక్ ఉన్నవాళ్లే పెట్రోల్ కొంటారు. వాళ్లేం ఆకలితో అలమటించడం లేదు.
పన్నులు కడతారు వాళ్లు. అలా వచ్చిన పన్నులను మేం పేదల అభివృద్ధికి ఉపయోగిస్తాం. పేదలకు ఇల్లు, దొడ్డి వస్తాయి. చెల్లించే వాళ్లకే పన్నులు వడ్డిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. దీనిపై సామాన్య జనం, విపక్షాలు మండిపడుతున్నాయి. మోటార్ బైక్ సామాన్యుల వాహనంగా మారిందని, సామాన్యులు కార్లలో తిరగరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్లలో తిరిగే వారిని, బైకులపై తిరిగే వారిని ఒకేగాటన కట్టడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు. ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలిసుకున్న వారికి వారి బాధలు అర్థం అవుతాయని, ప్రజల్లో కలవకుండా, కేవలం ప్రభుత్వాధికారిగా పనిచేసిన అల్ఫోన్స్ కు అవి అర్థం కావని విమర్శిస్తున్నాయి. పెట్రోల్ ధరలను రోజువారీ సవరిస్తున్నాక ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుండడం తెలిసిందే.