నిదానంగా సాగే జింద‌గీ... - MicTv.in - Telugu News
mictv telugu

నిదానంగా సాగే జింద‌గీ…

October 27, 2017

హీరో రామ్, ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ‘నేను.. శైల‌జ’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. రామ్ కెరీర్‌లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత వీరిద్ద‌రి క‌లయిక‌లో రూపొందిన చిత్రం ‘ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ’.  

స్నేహం, ప్రేమ అంశాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఓ పెద్ద హిట్ త‌ర్వాత రామ్‌, కిషోర్ తిరుమ‌ల మ‌ళ్లీ క‌లిసి  సినిమా చేస్తుండ‌టం, రాక్‌స్టార్‌గా రామ్ కొత్త పాత్ర‌లో క‌నిపించ‌డంతో ప్రారంభం నుంచే సినిమా భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. నేను శైల‌జ ఫ‌లితాన్ని ఈ సినిమా పున‌రావృతం చేసిందా? రామ్‌కు కిషోర్ తిరుమ‌ల మ‌రో విజ‌యాన్ని అందించాడా? లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే…

అభిరామ్‌(రామ్‌), వాసు(శ్రీ‌విష్ణు) బాల్యమిత్రులు. ఒక‌రంటే మ‌రొక‌రికి ప్రాణం. అభిరామ్ చాలా ప్రాక్టిక‌ల్‌. జీవితాన్ని సింపుల్‌గా గ‌డ‌పాల‌న్న‌ది అత‌డి త‌త్వం. కానీ వాసు సున్నిత మ‌న‌స్కుడు.  అభిరామ్‌, వాసు ఇద్ద‌రు మ‌హా(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) అనే అమ్మాయిని ప్రేమిస్తారు.  ఒకేసారి ఆమెకు త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తారు. అభిరామ్‌ను కాద‌ని వాసు ప్రేమ‌ను మ‌హా అంగీక‌రిస్తుంది. అత‌డినే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. మ‌హా ప్రేమ కార‌ణంగా వాసు…అభిరామ్‌ల మ‌ధ్య దూరం పెరుగుతుంది. ప్రేమ కోసం వాసు త‌మ స్నేహాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం న‌చ్చ‌క‌పోవ‌డంతో అభిరామ్ అత‌డికి దూరంగా వెళ్లిపోతాడు. మ‌హా చ‌నిపోయింద‌నే నిజం తెలియ‌డంతో నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ స్నేహితుడిని వెతుక్కుంటూ వ‌స్తాడు. వారిద్ద‌రి మ‌ధ్య పూర్వ స్నేహం కొన‌సాగిందా? వాసును వ‌దిలి అభిరామ్ ఎందుకు దూరంగా వెళ్లిపోయాడు? మ‌హా ఎవ‌రిని ప్రేమించింది? మ‌్యాగీ(లావ‌ణ్య త్రిపాఠి), అభిరామ్‌ల ప్రేమాయ‌ణం  విజ‌య‌వంత‌మైందా?లేదా అన్న‌దే మిగ‌తా క‌థ‌.

చిన్న‌నాటి స్నేహం గొప్ప‌త‌నాన్ని చాటిచెపుతూ తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఆఫీస్‌, కాలేజీ  స్నేహాల‌తో పోలిస్తే బాల్య‌పు స్నేహాలు మాత్ర‌మే క‌ల‌కాలం నిల‌బ‌డ‌తాయ‌నే పాయింట్‌కు ప్రేమ‌, వినోదాన్ని జోడించి ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ఈ సినిమాను రూపొందించారు. స్నేహితుల స‌ర‌దాలు, వారి ప్రేమ‌క‌థ‌లు,  ఇద్ద‌రూ ఒకే అమ్మాయిని ప్రేమించ‌డం ఇలా సినిమాను ఆస‌క్తిక‌రంగా ప్రారంభించారు ద‌ర్శ‌కుడు. ద్వితీయార్థంలో ఆ ఉత్కంఠ‌ను కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.  క‌థ‌పై ప‌ట్టుకోల్పోయిన భావ‌న క‌లుగుతుంది. అభిరామ్‌, వాసుల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని బ‌లంగా చాటిచెప్పే స‌న్నివేశాలు, వారి విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు క‌న్విన్సింగ్‌గా లేక‌పోవ‌డంతో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ యావ‌రేజ్ సినిమాగా నిలిచింది. క‌థాగ‌మ‌నం నిదానంగా సాగ‌డం, నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల్లో  కృత్రిమ‌త్వం ఎక్కువ‌గా ఉండ‌టంతో  సినిమాతో ప్రేక్ష‌కులు ఎక్క‌డ క‌నెక్ట్ కాలేరు. ప్రాణ స్నేహితుడు దూర‌మైన త‌ర్వాత ఓ వ్య‌క్తి ప‌డే బాధ‌ను స‌రిగా చూపించ‌లేక‌పోయారు. ‘ప్రేమ‌దేశం’తో పాటు స్నేహం నేప‌థ్యంలో తెలుగులో గ‌తంలో వ‌చ్చిన  చాలా సినిమాల్ని గుర్తుకుతెస్తుంది ఇది.  క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా పాత్ర‌ల మ‌ధ్య భావోద్వేగాలు స‌రిగా పండ‌టంతో ‘నేను.. శైల‌జ’ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. అలాంటి స‌న్నివేశాలు ఈ సినిమాలో లోపించాయి.

కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడిగా త‌డబ‌డిన సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా మాత్రం ఆక‌ట్టుకున్నారు. స్నేహితుల‌ మ‌ధ్య దూరం ఉండే ప్ర‌దేశాన్ని బ‌ట్టి కాకుండా మ‌న‌సులో ఉండే స్థానంపై ఆధార‌ప‌డి ఉంటుందంటూ త‌న సంభాష‌ణ‌ల‌తో  మ‌న‌సుల్ని క‌దిలించారు. గ‌త సినిమాల త‌ర‌హాలోనే  స‌హ‌జ‌త్వానికి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త‌నిస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటుంది.

స్నేహానికి ప్రాణ‌మిచ్చే న‌వ‌త‌రం యువ‌కుడిగా  రామ్ పాత్ర ఎనర్జిటిక్‌గా సాగింది. ఎప్ప‌టిలాగే త‌న హుషారైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. గ‌డ్డం, మీసాలు, ర‌ఫ్ లుక్‌తో  కొత్త‌గా క‌నిపించారు.  క‌ల‌ల‌కు, బంధాల‌కు మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌య్యే యువ‌తిగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చ‌క్క‌టి  అభిన‌యాన్ని క‌న‌బ‌రిచింది.  లావ‌ణ్య త్రిపాఠి గ్లామ‌ర్ ప‌రంగా సినిమాకు అండ‌గా నిలిచింది. కీల‌క‌మైన వాసు పాత్ర‌లో శ్రీ‌విష్ణు స‌హ‌జ న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. హీరో స్నేహితులుగా క‌నిపించిన ప్రియ‌ద‌ర్శి, కిరీటి చ‌క్క‌టి కామెడీని పండించారు. క‌థానుగుణంగానే హాస్యాన్ని ఆవిష్క‌రించిన  తీరు బాగుంది.

దేవీశ్రీ‌ప్ర‌సాద్ బాణీలు, నేప‌థ్య సంగీతం, స‌మీర్‌రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ర‌య్యి ర‌య్యి, వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా గీతాలు మాస్ ప్రేక్ష‌కుల్ని  అల‌రిస్తాయి. విశాఖ ప్ర‌కృతి అందాల‌కు పెద్ద‌పీట వేస్తూ కెమెరామెన్ స‌మీర్‌రెడ్డి సినిమాను అందంగా మ‌లిచారు. స్ర‌వంతి మూవీస్‌, పి.ఆర్ సినిమాస్ సంస్థ‌లు త‌క్కువ బడ్జెట్‌తో సినిమాను  ఉన్న‌తంగా తీర్చిదిద్దారు.

ఇమేజ్‌, మాస్ హంగులు, క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌ల‌ను బేరీజు వేసుకోకుండా నిజాయితీగా చిత్ర‌బృందం చేసిన ప్ర‌య‌త్న‌మిది. రెగ్యుల‌ర్ సినిమాల్లో క‌నిపించే ప్ర‌త్యేక‌గీతాలు, ప్రేమ‌పాట‌లు, భారీ పోరాట ఘ‌ట్టాలు ఇందులో క‌నిపించ‌వు.  కొత్త‌ద‌నాన్ని కోరుకునే ప్రేక్ష‌కుల్ని కొంత‌వ‌ర‌కు ఈ సినిమా మెప్పిస్తుంది.

రేటింగ్‌2.5/5