నిందితులను వదలొద్దు.. ఉన్నావో బాధితురాలి చివరిమాటలు - MicTv.in - Telugu News
mictv telugu

నిందితులను వదలొద్దు.. ఉన్నావో బాధితురాలి చివరిమాటలు

December 7, 2019

Unnao

దిశ మాదిరే ఆమె కథ కూడా ముగిసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె చివరికి మృత్యువు ముందు ఓడిపోయింది. కామాంధుల కీచక క్రీడలో మరో అబల బలైంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో‌కు చెందిన అత్యాచార బాధితురాలు గత అర్ధరాత్రి కన్నుమూసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ‘నేను బుతకుతానా? నేను చనిపోవద్దు. నన్ను కాపాడండి. నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన వారిని అస్సలు వదిలిపెట్టవద్దు’ అని బాధితురాలు చివరగా పదేపదే చెప్పినట్టు వైద్యులు చెప్పారు. 

అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టుకు హాజరు అయ్యేందుకు గురువారం ఆమె గ్రామం నుంచి బయలుదేరారు. దారిలో ఐదుగురు నిందితులు కాపుకాసి ఆమెను అడ్డగించి దాడిచేశారు. ఆపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే హెలికాప్టర్ ద్వారా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి ఆమె మృతిచెందారు. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేదీ కూడా సజీవ దహనానికి యత్నించిన వారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, గతేడాది డిసెంబర్‌లో బాధితురాలు అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. పెళ్లి పేరుతో ఆమెను నమ్మించిన నిందితుడు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు గత నెల 25న విడుదల అయ్యాడు. బయటకు వచ్చిన నిందితుడు తనను జైలుకు పంపిన ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను హత్య చేసేందుకు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు.