ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. పవన్-బాలయ్య ఒకే వేదిక కనిపించడంతో అ భిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖలకు తీవ్ర ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ ప్రశ్నలు..దానికి ధీటుగా పవన్ జవాబులు మొదటి ఎపిసోడ్ ను విజయవంతం చేశాయి. పవన్ మూడు పెళ్లిళ్ల అంశం, పొలిటికల్ మసాల కూడా ఈ ఎపిసోడ్‌లో తగలడంతో హైలెట్ గా నిలిచింది . ఇంకా దానిపైనే చర్చ నడుస్తున్న సమయంలోనే ఎపిసోడ్ -2 ప్రోమో విడుదల చేసింది ఆహా టీమ్.
ప్రోమో విడుదల చేసిన కాసేపటికే యూట్యూట్ లో దూసుకుపోతుంది. కొద్ది గంటల్లోనే లక్షలాది వీక్షించారు. ప్రోమోలో చాలా వరకు రాజకీయ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు బాలయ్య వేశారు. ” ఆ జేబులో ఏమి పెట్టుకున్నావు. ఎవరిని కొట్టకుండా ఆపుకోవడానికి పెట్టుకున్నావా ? అంటూ బాలయ్య.. పవన్ కళ్యాణ్‌ను అడగడంతో ప్రోమో ప్రారంభమైంది. తర్వాత ఇప్పటం వెళ్లేసమయంలో కారుపై ప్రయాణించిన పవన్ ఫోటోను చూపెట్టి దానిపై బాలయ్య తెలుసుకోవడం ఆసక్తి రేపుతుంది. ప్రధానంగా మీరు పార్టీ ఎందుకు పెట్టారు…టీడీపీలో చేరొచ్చు కదా.. ? అంటూ బాలయ్య అడిగిన ప్రశ్నలు పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. రాష్ట్రంలో నీ ఫ్యాన్ కానీవాడు లేడు. మీ మ్యానిఫెస్టోను పూర్తిగా ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడం వల్ల అవి ఓట్లుగా కన్వర్ట్‌గా కాలేదని పవన్ తో బాలయ్య వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
షోమధ్యలో వచ్చి సందడి చేసిన డైరెక్టర్ క్రిష్‌ను బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నించారు. పవన్, నాతో పనిచేశావు కదా మా ఇద్దరి మధ్య ఏంటీ తేడా అడగ్గా.. ‘ఒక సింహం, పులి మధ్య నా తల ఉంది’ అంటూ క్రిష్ సమాధానం ఇచ్చాడు. ఈ మధ్య నీ విమర్శల్లో వాడీ,వేడీ ఎక్కువైంది అంటూ పవన్ ను ఉద్దేశించి బాలయ్య అనగా…లేదండీ నేను చాలా పద్దతిగా మాట్లాడతా అంటూ పవన్ సమాధానం ఇవ్వడం నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఫిబ్రవరి 10న విడుదుల చేస్తున్న ఆహా టీమ్ ప్రకటించింది.