లాక్‌డౌన్ తూచ్.. ఆవు అంత్యక్రియలకు పోటెత్తిన జనం
కొన్నిచోట్ల సెంటిమెంట్ల సాకుతో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎవరైనా చనిపోతే 20 మంది కన్నా ఎక్కువమంది ఆ అంత్యక్రియల్లో పాల్గొనవద్దని నిబంధన ఉంది. అయితే ఓచోట అంత్యక్రియల్లో 150 మంది పాల్గొన్నారు. అదీ ఒక ఆవు అంత్యక్రియల్లో. దేశవ్యాప్త లాక్‌డౌన్ 4.0 అమలులో ఉందన్న విషయం మరిచి.. అంతమంది కలిసి ఆవు అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గ్రామస్థులు దాదాపు 150 మంది కలిసి ఆవుకు అత్యంత ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. సామూహిక కార్యక్రమాలపై నిషేధం ఉన్నా వారు ఈ పనికి పూనుకున్నారు. ఊరు ఊరంతా కలిసి ఇలా ఆవు అంత్యక్రియలు నిర్వహించి విస్మయానికి గురిచేశారు. వీరంతా లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిగానే భావిస్తూ కేసు నమోదు చేసినట్లు అలీగఢ్ సీవో అనిల్ సమానియా వెల్లడించారు.
ఇలాంటి ఘటనే తమిళనాడులో రెండేళ్ల క్రితం జరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి విజయ భాస్కర్ ఎంతో ప్రేమగా పెంచుకున్న ఎద్దు ఆకస్మికంగా మరణించింది. జల్లికట్టులో పాల్గొన్న సదరు ఆంబోతు సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి అంతర్గత రక్తస్రావంతో అక్కడే కుప్పకూలి మృతిచెందింది. దీంతో ఆ ఎద్దు యుద్ధంలో వీరమరణం పొందిందని భావించిన దాని యజమాని మంత్రిగారు దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. సుమారు వెయ్యిమంది దాని అంత్యక్రియల్లో పాల్గొని విస్తుగొలిపారు. కాగా, అప్పుడంటే కరోనా లేదు కాబట్టి అది ఆశ్చర్యకర ఘటన అయింది. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ నిబంధనల్లో ఆవు అంత్యక్రియలు నిర్వహించడం కలకలంగా మారింది.