మద్యం.. మాటల్లో చెప్పలేని నేరాలకు దారితీస్తోంది. పూటుగా తాగి ఇంటికొచ్చి తనను కొట్టి, గొడవ పెట్టుకున్న కొడుకును ఓ తల్లి నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి చంపేసింది. ఉత్తరప్రదేశ్ శాసనమండలి చైర్మెన్ రమేశ్ యాదవ్ ఇంట్లో ఈ సంఘటన జరిగింది. మొదట్లో కొడుకు గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన రమేశ్ భార్య మీరా పోలీసుల విచారణలో నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు.
రమేశ్ యాదవ్కు మీరా రెండో భార్య. కొడుకు అభిజిత్ యాదవ్(23) ఆదివారం రాత్రి తాగి లక్నోలోని ఇంటికి వచ్చాడు. మీరా అతణ్ని లోపలికి తీసుకెళ్లింది. తర్వాత అతడు గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. అయితే కుర్రాడు గుండెపోటుతో పోవడమేంటని కుటుంబ సభ్యుల్లో కొందరికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గొంతు నులమడంతో చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కొడుకు తనతో దురుసుగా ప్రవర్తించాడని, దాడి చేశాడని మీరా తెలిపింది. సహనం కోల్పోయి అతణ్ని గోడకు అదిమిపెట్టి గొంతు నులిమి చంపేశానని భోరున విలపిస్తూ అగీకరించింది.