చరిత్రలో కని విని ఎరుగని ఘటన ఒకటి ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకుంది. అసెంబ్లీ కాస్త న్యాయస్థానంగా మారి ఆరుగురు పోలీసులకు శిక్ష విధించింది. అసెంబ్లీ ఏంటి? అది కూడా పోలీసులకే శిక్ష వేయడమేంటనే అనుమానం అందరికి రావొచ్చు. కానీ దాని వెనుక పెద్ద కథే ఉంది. దాదాపు 20 ఏండ్ల నాటి ముచ్చట అది. 2004లో ఓ బీజేపి ఎమ్మెల్యే పట్ల ఆరుగురు పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారట. సలీల్ విష్ణోయ్ అనే ఎమ్మెల్యేతోపాటు ఆయన మద్దతుదారులపై కూడా పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీనిపై ఆయన అప్పట్లోనే సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కమిటీ.. ఆరుగురికి శిక్ష విధించాలని సోమవారం సిఫార్సు చేసింది. ఈ మేరకు నిందితులను శుక్రవారం సభకు పిలిపించింది. వారికి జైలు శిక్ష విధించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ప్రతిపాదించారు.
కాన్పూర్‌లో విద్యుత్ కోతలకు నిరసనగా 2004 సెప్టెంబరు 15న అప్పటి బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ఆధ్వర్యంలోని ఓ బృందం కాన్పూర్‌నగర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు సమర్పించేందుకు వెళ్తుండగా.. పోలీసు సిబ్బంది ఆయనను ఆయన అనుచరులను అడ్డుకున్నారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తించటమే కాకుండా లాఠీచార్జ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సదరు ఎమ్మెల్యే శాసనసభ తనకు కల్పించిన ప్రత్యేక హక్కులకు భంగం వాటిల్లినట్లు ఆరోపిస్తూ.. హౌస్ ఆఫ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ప్రస్తుతం యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్నారు. ఈ దాడిలో ఆయన కాలు విరిగి ఆస్పత్రిపాలయ్యారు.
ఎమ్మెల్యే ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ.. ఇటీవల సంబంధిత పోలీసులకు శిక్ష విధించాలంటూ సిఫార్సు చేసింది. దీంతో శాసనసభ శుక్రవారం సదరు పోలీసులకు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా.. ఆరుగురు పోలీసులకు ఒక రోజు నిర్బంధం విధించాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి 12 గంటల వరకు వారిని అసెంబ్లీలోనే నిర్బంధించాలని స్పీకర్ సతీష్ మహానా ఆదేశించారు. కానీ ఆ పోలీసుల పట్ల మర్యాదగానే వ్యవహరించాలని సూచించారు.
ఈ ఆరుగురు పోలీసుల్లో బాబుపూర్వా ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ సమద్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యారు. అలాగే కిద్వాయ్ నగర్ ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్ శుక్లా, ఎస్సై త్రిలోకి సింగ్, కానిస్టేబుళ్లు ఛోటే సింగ్, వినోద్ మిశ్రా, మెహర్బాన్ సింగ్‌లకు అసెంబ్లీ తాజాగా ఈ వినూత్న శిక్ష విధించింది. విచారణకు సంబంధించి అసెంబ్లీకి హాజరైన వీరంతా ఆనాడు జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పారు. దీంతో వారికి స్పీకర్ ఒకరోజు నిర్భంధ శిక్ష విధించారు. అసెంబ్లీ విధించిన శిక్షను పాటించటానికి సదరు పోలీసులు విధానసభ భవనంలోని ఓ గదిలో ఉండిపోవాల్సి వచ్చింది. వారికి స్పీకర్ ఆదేశాల ప్రకారం ఆహారం, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. మర్యాదగా చూసుకున్నారు.