అయోధ్య మసీదు నిర్మాణానికి యోగిని పిలుస్తాం..  - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య మసీదు నిర్మాణానికి యోగిని పిలుస్తాం.. 

August 8, 2020

''UP CM to be invited to lay foundation stone for public facilities on land for mosque in Ayodhya''

అయోధ్యలో రామ మందిరం భూమిపూజ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎంతో కన్నుల పండుగగా జరిగిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో మసీదు కూడా నిర్మించాల్సి ఉండగా.. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మసీదు నిర్మాణ శంకుస్థాపనకు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ను ఆహ్వానించే విషయంలో ముస్లిం నేతలు శనివారం ఓ స్పష్టతనిచ్చారు. అయోధ్యలోని ధన్నీపూర్‌లో నిర్మించబోయే మసీదు శంకుస్థాపనకు యోగీని కచ్చితంగా ఆహ్వానిస్తామని సదరు ఫౌండేషన్ వెల్లడించింది. ఈ విషయమై ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అథర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘ధన్నీపూర్‌లో 5 ఎకరాల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం చేపడతాం. ఇందులో ఓ ఆసుపత్రి, గ్రంథాలయం, వంటశాల, ఓ అధ్యయన కేంద్రాన్ని కూడా నిర్మిస్తాం. మసీదు శంకుస్థాపనకు సీఎం యోగీని ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొనడమే కాకుండా.. ప్రజల సౌకర్యానికి నిర్మించే వాటికి ఆర్థిక సహాయం కూడా అందిస్తారు’ అని తెలిపారు. 

ఇదిలావుండగా ధన్నీపూర్‌లో నిర్మించే మసీదుకు ‘బాబ్రీ మసీదు’ అనే నామకరణం చేస్తారా? అనే ప్రశ్నుకు ఆయన సమాధానం ఇస్తూ.. పేర్లకు అంత ప్రాముఖ్యం లేదని, మసీదు మాత్రమే తమకు ప్రాముఖ్యం అని స్పష్టంచేశారు. మసీదు తప్ప మిగితా వ్యవహారాలన్నీ అర్థంపర్థం లేనివని హుస్సేన్ అన్నారు. అయితే ఒకవేళ ఆ మసీదు ప్రారంభోత్సవానికి ఆహ్వానం వస్తే, ఆ కార్యక్రమానికి ఓ హిందువుగా తాను వెళ్ళను అని సీఎం యోగి చెప్పారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘నేను ఓ యోగిని. హిందువుగా నేను మసీదు ప్రారంభానికి వెళ్లను. ముఖ్యమంత్రిగా మీరు నన్ను అడిగితే ఏ విశ్వాసం, మతం, కులంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక యోగిగా మీరు నన్ను అడిగితే హిందువుగా మసీదు ప్రారంభానికి వెళ్లబోను. నా ప్రార్ధనా పద్ధతులను అనుసరించడం ఓ హిందువుగా నా కర్తవ్యం. అందుకు అనుగుణంగా నడుచుకుంటాను. ఈ వ్యవహారంలో తాను వాదిని కాదు.. ప్రతివాదినీ కాదు. నన్ను పిలిచినా పిలవకపోయినా నేను హాజరుకాను. అసులు నాకు అలాంటి ఆహ్వానం అందదు’ అని యోగీ స్పష్టంచేశారు. చూడాలి మరి మసీదు శంకుస్థాపనకు ముస్లింల నుంచి ఆహ్వానం వెళితే యోగీ వెళ్తారా లేదా అనేది.