భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో యోగి.. పాతబస్తీలో హైఅలర్ట్
హైదరాబాద్ నగరంలో జాతీయ రాజకీయ నేతల సందడి నెలకొంది. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు నగరానికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి ఆలయానికి నేతల తాకిడి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు అమ్మవారి ఆలయాన్ని సందర్శించగా.. ఆదివారం ఉదయం ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యోగితో పాటు తెలంగాణ బీజేపీ లీడర్లు బండి సంజయ్, లక్ష్మణ్, రాజాసింగ్, పలువురు బీజేపీ నేతలు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. యోగికి ఆలయ కమిటీ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించింది. యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసులు నిఘా పెట్టారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ 500 మీటర్ల రేడియస్‌లో మూడు వలయాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 350మంది పోలీస్‌లతో చార్మినార్ భాగ్యలక్ష్మి లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. హెచ్‌ఐసీసీ నుంచి 7:30కు బయలుదేరి భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు యోగి 8 గంటలకు చేరుకున్నారు.