లీడర్ కో బడి..! - MicTv.in - Telugu News
mictv telugu

లీడర్ కో బడి..!

June 27, 2017

సర్కార్ బడులవైపు లీడర్లు కన్నెత్తి చూడరు. జనవరి ఇరవై ఆరో, ఆగస్టు పదిహేను కో పిలిస్తే నాలుగు మాటలు లొడలొడ మాట్లాడి వచ్చేస్తారు. మరెప్పుడూ ఆ స్కూళ్ల గురించి ఆలోచించరు. ఎవరైనా విద్యార్థుల పేరెంట్స్ సమస్యలు చెప్పినా వినిపించుకోరు.ఇక ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు. లీడర్ అన్నాక బడికి కెళ్లాల్సిందే. నాయకులకు స్కూల్ కు లింకు ఏంటీ అనుకుంటున్నారా..?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. పలు నియోజకవర్గాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు దెబ్బతిన్నాయని,స్థానికంగా చిన్నారులు చదువుకు దూరం అవుతున్నారని తెలుసుకున్నారు. ఆయా స్కూళ్లను పునరుద్దరించాలన్న ఉద్దేశంతో దత్తత మంత్రాన్ని తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

యూపీలో అమలవుతోన్న విద్యా విధానంపై సీఎం యోగి ఆధ్వర్యంలో అధికారులు చర్చలు జరిపారు. ప్రభుత్వం అందించే సహకారం ప్రతి ఒక్కరికీ అందజేయాలని ఈ క్రమంలోనే పాఠశాలలను పునరుద్ధరించాలన్న యోచనలో ఉన్నారు. పాఠశాలలకు చిన్నారులు తరలి రావాలంటే ముందుగా ఆయా పాఠశాలలను పునరుద్ధరించాలని ఇందుకుగాను ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు కనీసం ఒక్క పాఠశాలనైనా దత్తత తీసుకుని మెరుగుపరచాలని కోరారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని సీఎం యోగి పిలుపునిచ్చారు. ఏడాదిలోగా పాఠశాలల పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతమైతే 2018 నాటికి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన విద్యా విధానాన్ని చిన్నారులకు అందించవచ్చన్నారు.

నిజమే లీడర్ కో బడి దత్తత సూపర్ ఐడియా..పక్కాగా అమలైతే పల్లె పాఠశాలల్లో విద్యా వెలుగులు వికసిస్తాయి. ఏ సమస్య ఉన్నా దత్తత తీసుకున్న నేత దగ్గరుండి మరి పరిష్కారిస్తారు. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న డైనమిక్ సీఎం యోగి నిర్ణయం దేశం దృష్టిని ఆకర్షించేలా ఉంది. మిగతా సీఎం లు ఆలోచించండి.. సర్కారీ స్కూళ్లను బాగు చేయండి.