గడ్డం తీసేయలేదని ఎస్ఐ సస్పెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

గడ్డం తీసేయలేదని ఎస్ఐ సస్పెన్షన్

October 22, 2020

కొన్ని సంస్థల్లో ఉద్యోగం అనగానే నీట్‌గా షేవ్ చేసుకోవాలి, ఇన్‌షర్ట్ ధరించాలి. గడ్డాలు, మీసాలు, పెద్ద పెద్దగా తల వెంట్రుకలు పెట్టుకుంటామంటే నిబంధనలు ఒప్పుకోవు. ఈ నేపథ్యంలో సాంప్రదాయం ప్రకారం గడ్డం తియ్యని కారణంగా ఓ ఎస్సైని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతెజార్ అలీ అనే ఎస్సై బాగ్‌పత్‌‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తన మత సాంప్రదాయం ప్రకారం గెడ్డం పెంచుకున్నాడు. దీనిని అంగీకరించని ఉన్నతాధికారులు గడ్డం చేయించుకోవాల్సిందిగా ఇప్పటికే మూడుసార్లు ఆదేశించారు. అయితే అతను వాటిని పట్టించుకోలేదు. దీంతో ఇంతెజార్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. 

పోలీసు మాన్యువల్‌ ప్రకారం కేవలం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకోవడానికి అనుమతి ఉందని బాగ్‌పత్‌ ఎస్పీ అభిషేక్‌ సింగ్‌ తెలిపారు. సిక్కులను మినహాయించి మిగతావారందరూ నీట్‌గా గడ్డం చేయించుకోవాల్సిందేనని అన్నారు. ఒకవేళ గడ్డం ఉంచుకోవాలనుకుంటే అతను దాని కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇంతెజార్‌ అలీని పదే పదే అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించినా అతడు దానిని పాటించలేదని పేర్కొన్నారు. అనుమతి లేకుండా గడ్డం ఉంచుకున్నందున సస్పెండ్‌ చేశామని చెప్పారు. ఈ విషయమై ఇంతెజార్‌ మాట్లాడుతూ.. ‘గడ్డం ఉంచడానికి అనుమతి కోరుతూ నేను దరఖాస్తు చేశాను. కానీ పై అధికారుల నుంచి నాకు స్పందన రాలేదు’ అని అన్నారు.