పిట్టపోరు పిట్టపోరు పిల్ల తీర్చిందని సామెత. ఇది కూడా అంలాంటి కథే.. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ యజమానికి, దానిని దొంగిలించిన తాత్కాలిక యజమానికి ఓ చిలక షాక్ ఇచ్చింది. మీరిద్దరు నాకోసం కొట్టుకుచావండి.. ఎవరి దగ్గరున్నా నాకు ఆ పంజరమే దిక్కని నిర్ణయించుకుని తుర్రున ఆకాశంలోకి స్వేచ్ఛగా ఎగిరిపోయింది. దీంతో ఆ ఇద్దరు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఉత్తరప్రదేశ్లో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. లక్నోకు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ క్రిపాల్ ఓ చిలుకను ఎంతో లాలనగా పెంచుకుంటున్నాడు. దానిని తన ఇంటి సభ్యురాలిగా భావించి, నిత్యం దానికి మంచి పళ్లు తినిపించేవాడు. అయితే గత మంగళవారం ఆ చిలుక పంజరం నుంచి తప్పించుకుని కనిపించకుండా పోయింది.
దీంతో యజమాని కంగారుపడ్డాడు. దానికోసం ఎక్కడెక్కడో వెదికాడు. అయితే ఎదురింటికే వెళ్లిందని అనుమానించాడు. దీంతో వారింటికి వెళ్లి చూడగా ఇంట్లో పంజరంలో చిలుక ఉంది. దానిని చూసి తన చిలుకను ఎందుకు దొంగిలించావని ప్రశ్నించాడు. తాము ఏ చిలుకనూ దొంగలించలేదని, ఆ చిలుక తమదేనని వాళ్లు బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో పంచాయితీ ఏషియానా పోలీస్ స్టేషన్కు చేరింది. స్టేషన్ ఇన్ఛార్జ్ ఈ సమస్యను అక్బర్-బీర్బల్ కథలోలా తెలివిగా పరిష్కరించాలని పాచిక వేశాడు.
పంజరాన్ని తెరిచినపుడు చిలుక యాజమాని దగ్గరకు వెళుతుందని, తద్వారా యాజమాని ఎవరో తెలుస్తుందని అనుకున్నాడు. ఈ విషయం వాళ్లకు చెప్పి, యాజమాని దగ్గరకు వెళ్లమని చిలుక పంజరాన్ని తెరిచాడు. అయితే ఆ చిలుక యజమాని ఇంటికి వెళ్లకుండా చక్కగా ఆకాశానికి ఎగిరి వెళ్లిపోయింది.