కరోనా ఉందని బస్సులోంచి తోసి చంపేశారు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఉందని బస్సులోంచి తోసి చంపేశారు

July 10, 2020

bus

కరోనా వైరస్ అత్యంత భయంకరమైందనుకుంటే దాని భయంలో పడ్డ మనుషులు దాని కన్నా భయంకరంగా ప్రవర్తిస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికే భౌతిక దూరంతో మనుషలు మధ్య దూరాలు పెరుగుతున్నాయి. మనుషుల్లో కరోనా భయాలు తోటి మనిషిని చంపేసేంత దారుణానికి ఒడిగట్టేంత వరకు వెళ్లాయి. ఆర్టీసీ బస్సులో 19 ఏళ్ల ఓ యువతిని కరోనా అనుమానంతో బస్సులో నుంచి నిర్ధాక్షిణ్యంగా తోసేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన అన్షిక యాదవ్ (19) జూన్ 15న తన తల్లితో కలిసి ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయల్దేరింది. వాళ్లు యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా శికోహాబాద్ చేరాల్సి ఉంది. అయితే.. బస్సు బయల్దేరిన కొద్దిసేపటికే యువతికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా కొంతమంది అనుమానాలు వ్యక్తంచేశారు. ఆమెను వెంటనే బస్సులో నుంచి దింపేయాలని డ్రైవర్, కండక్టర్‌ను కోరారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని సదరు బాలిక, ఆమె తల్లి ఎంతగా మొర పెట్టుకున్నా.. వారు వినిపించుకోలేదు. ప్రయాణికులు అందరూ ఆందోళన వ్యక్తం చేయడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ యువతిని బలవంతంగా కిందకి దింపే ప్రయత్నం చేశారు. 

అన్షిక ప్రతిఘటించడంతో కిందకు తోసేశారు. రోడ్డుపై పడిపోయిన యువతి అరగంట తర్వాత మృతిచెందింది. ఢిల్లీ-యూపీ యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే మృతురాలి తల్లి మథుర పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్షికను తాకితే కరోనా సోకుతుందని భయపడి డ్రైవర్ ఆమెను దుప్పటితో చుట్టి బస్సులో నుంచి తోసేసినట్లు బాలిక సోదరుడు విపిన్ తెలిపాడు. ‘అన్షికకు ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. కిడ్నీలో రాళ్లు చేరి కొంత కాలం బాధపడి, దానికి చికిత్స తీసుకుంది. అంతకుమించిఏ సమస్యా లేదు. అరోగ్యంగా ఉన్న మనిషి బస్సు నుంచి బయటపడగానే ఎలా మరణిస్తుంది?’ అని విపిన్ ప్రశ్నిస్తున్నాడు. అయితే యువతిది సహజ మరణమేనని.. ఆమె గుండెపోటుతో మరణించిందని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. సమగ్ర దర్యాప్తు జరిపించాలని మథుర ఎస్‌ఎస్పీ గౌరవ్ గ్రోవర్‌ను కోరింది. కాగా, అన్షిక మృతి అనంతరం ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించకపోవడం ఈ కేసులో మరో అడ్డంకిగా మారింది. మథురలో కొవిడ్ నిబంధనల ప్రకారం.. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించడంలేదని అధికారులు వెల్లడించారు.