దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అక్కడ గత కొన్ని నెలలుగా వర్షాలు కురియడం లేదు. వర్షా కాలం ఆరంభమైనప్పటికీ వరుణుడు కరుణించలేదు. దీంతో వర్షాలు కురవకపోవడానికి ఆ ఇంద్రుడే కారణమంటూ.. ఆ దేవునిపై ఫిర్యాదు చేశాడు ఓ రైతు. అలా ఫిర్యాదు చేయడమే చిత్రం అనుకుంటే.. తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానిస్తూ ఆ లేఖను కలెక్టర్‌కు తహసీల్దార్ పంపించడం మరింత విచిత్రంగా మారింది.
యూపీలోని గోండు జిల్లాకు చెందిన సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు.. తమ గ్రామంలో సకాలంలో వర్షాలు పడకపోవడానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులు అని ఆరోపిస్తూ ఓ లేఖ రాశాడు. ఆ లేఖను ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా రెవెన్యూ అధికారులకు అందించాడు. ఆ లేఖను చదవకుండానే ఎన్ఎన్ వర్మ అనే రెవెన్యూ అధికారి.. కలెక్టర్‌కు ఫార్వార్డ్ చేశాడు. అంతేకాదు.. `బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల`ని సిఫారసు కూడా చేశాడు. ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వర్మ మాట మార్చాడు. తన దగ్గరకు అలాంటి లేఖ రానే లేదని బుకాయిస్తున్నాడు.
మరోవైపు నెటిజన్లు దీనిపై ఒక్కటే కామెంట్లు పెడుతున్నారు. ఇంద్రుడు, వరుణుడిలపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు సెటైరికల్‌గా రియాక్ట్ అవుతున్నారు.