UP Man Bit While Showing Off Snake He Rescued, Dies
mictv telugu

పట్టుకున్న పాముతో పిచ్చి చేష్టలు.. నిండు ప్రాణం బలి

August 22, 2022

ఓ వ్యక్తి చేసిన ఓవరాక్షన్ చివరకు అతని ప్రాణాన్నే తీసింది. పాములు పడుతూ.. ఆపదలో ఉన్న చుట్టుపక్కల వారిని కాపాడేవాడిగా పేరున్న ఆ వ్యక్తి.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత తనకు తానే ఏదో సొంత వైద్యం చేసుకొని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర ప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌ జిల్లా పరిధిలోని జైతీపూర్‌ గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ గ్రామంలోని దేవేంద్ర మిశ్రా అనే వ్యక్తి అప్పుడప్పుడు గ్రామంలో, చుట్టుపక్కల ఊళ్లలో ఇళ్లలో దూరిన పాముల్ని పట్టి.. వాటిని ఊరి బయట అడవుల్లో సురక్షితంగా వదిలేస్తుంటాడు. ఈ క్రమంలో అతని ఇంటిపక్కన ఉన్న రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లో కట్లపాము దూరిందన్న సమాచారం అందుకున్నాడు. ఎప్పటిలాగే ఆ పామును ఓ కర్ర సాయంతో అతి సులువుగా పట్టుకున్నాడు. కానీ దానిని అడవిలో వదిలేయకుండా.. ఊరంతా ఓ రౌండ్ వేశాడు. అక్కడితో ఆగకుండా దానిని ఓ చిన్నారి మెడలో వేసి ఆటలాడాడు. ఆపై తన మెడలోనూ వేసుకుని ఊరంతా తిరిగాడు. అలా రెండు గంటలు గడిచిన తర్వాత.. పాము తల పట్టుసడలి అతన్ని కాటేసింది.

కాటేసిన పామును ఓ కుండలో బంధించాడు. పాము కరిచినా ఆస్పత్రికి వెళ్లకుండా.. ఆకు పసర్లతో ఆ గాయానికి సొంత వైద్యం చేసుకున్నాడు. ఆపై ఇంటికి చేరుకుని పడుకున్నాడు. పాము మరీ విషపూరితం కావడంతో.. అవేం పని చేయక అతని ప్రాణం పోయింది. అటు కుండ కింద ఉంచిన పాము కూడా చచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. సకాలంలో వైద్యం అంది ఉంటే అతని ప్రాణం దక్కేదని వైద్యులు చెప్తున్నారు.