UP minister ‘flees’ from courtroom after guilty verdict, cops to launch probe
mictv telugu

దోషిగా తేలడంతో కోర్టు నుంచి పరారైన మంత్రి

August 8, 2022

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ మంత్రి రాకేష్ సచన్‌ను ఓ కేసులో దోషిగా నిర్ధారించింది కోర్టు. శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా.. ఆ మంత్రి కోర్టు నుంచి అప్పటికప్పుడే పారిపోయారు. ముప్పై ఏండ్ల నాటి అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన రాకేష్‌.. తీర్పు అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. రాకేష్ సచన్‌ను దోషిగా తేల్చిన తర్వాత కోర్టులో ప్రతివాది లాయర్ రిచా గుప్తా గరిష్ట శిక్ష విధించాలని అభ్యర్థించారు. మంత్రి తరఫున న్యాయవాదులు శిక్ష ఖరారు చేయడంపై వాదనల కోసం సమయం కోరారు. అయితే కోర్టు సమయం ఇవ్వడానికి నిరాకరించింది. ఇంతలో జ్యుడిషియల్ అధికారులు ఛాంబర్‌కు వెళ్లారు. అయితే కోర్టు తీర్పుతో మంత్రి రాకేష్ సచన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. తీర్పు వెలువడగానే బెయిల్ బాండ్లను అందించకుండా కోర్టు నుంచి ఆయన పారిపోయారు.

దీంతో మంత్రి రాకేష్ సచన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో కాంగ్రెస్‌ నేత అయిన రాకేష్ సచన్‌ యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన మధ్య, చిన్న, సూక్ష్మ సంస్థలు, ఖాదీ శాఖల మంత్రిగా ఉన్నారు. కాగా, రాకేష్‌ సచన్‌ అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నట్లు 1991లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన రాకేష్‌, తీర్పు అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. మరోవైపు మంత్రి రాకేష్‌ తీరుపై ప్రతిపక్షాలు విమర్శించాయి. దోషిగా తేలిన ఆయన పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు కోర్టు నుంచి పారిపోయారని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన స్పందించారు. తాను కోర్టు నుంచి పారిపోలేదని, కావాలంటే అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ చూడాలని అన్నారు. ఇతర కార్యక్రమాలు ఉండటంతో వాటికి హాజరయ్యానని తెలిపారు.