ఎన్ని కఠిన చట్టాలు తీసుకుని వచ్చినా ఆడ వాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ సింగర్ అత్యాచారం కేసు సంచలనం రేపుతోంది. బీజేపీ మిత్రపక్షమైన నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా తనపై అత్యాచారం చేశాడని ఓ సింగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో విజయ్ మిశ్రా ఓ కార్యక్రమం కోసం 25 ఏళ్ల బాధిత సింగర్‌ని తన ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో విజయ్ మిశ్రా ఆమెపై అత్యాచారం చేశారు.
దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనని బెదిరించాడని ఆమె ఆరోపించింది. అలానే 2015లో వారణాసిలో ఒక హోటల్లో ఎమ్మెల్యే మరో సారి బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు ఆమె తెలిపింది. అత్యాచారం చేసిన తరువాత మిశ్రా ఆమెను ఇంటి దగ్గర వదిలేయమని కొడుకు, మేనల్లుడికి చెప్పారు. ఆమెను ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. యూపీలో ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ సంఘటన బయటికి రావడం సంచలనం రేపుతోంది.