ఎన్‌కౌంటర్లో పోలీస్ పిస్టల్ తుస్.. మిమిక్రీతో సక్సెస్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్‌కౌంటర్లో పోలీస్ పిస్టల్ తుస్.. మిమిక్రీతో సక్సెస్

October 14, 2018

పోలీసులకు, ఓ కరడుగట్టిన నేరస్తుడికి మధ్య హోరాహోరీ కాల్పులు సాగుతున్నాయి. ధన్ ధన్ అని కాల్చేసుకుంటున్నారు. ఇంతలో ఒక ఎస్ఐ పిస్టల్ జామ్ అయింది. తుస్ తుస్ తప్ప మరే శబ్దం రాలేదు. దీంతో ఎస్‌ఐ పక్కనున్న కానిస్టేబుల్ బుర్రకు పదును పెట్టాడు. అటువైపు కాల్పులు జరుపుతున్న దొంగకు ఎలాంటి చాన్సూ ఇవ్వద్దనుకున్నాడు. తన మిమిక్రీ కళకు పదును పెట్టి.. ధన్ ధన్.. ధన్ ధన్ అని పిస్టల్లా అరిచాడు. అవి నిజమైన కాల్పులే అనుకున్న దొంగ.. పారిపోవడం గురించి ఆలోచించకుండా ఆత్మరక్షణ కోసం మళ్లీ కాల్పులు జరుపుతూ అక్కడక్కడే తచ్చాడాడు. ఇంతలో మిగతా పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగ కాళ్లపై కాల్చి అరెస్ట్ చేశారు. సినీఫక్కీలో సాగిన ఈ వ్యవహారం ఎన్ కౌంటర్ల అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఈ నెల 12న జరిగింది. ఈ ఘటనలో ఒక పోలీసు కూడా గాయపడ్డాడు.  దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

18 క్రిమినల్‌ కేసుల్లో నిందితునిగా ఉన్న రుక్సార్‌ అనే దొంగ చాన్నాళ్లుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నాడు. వేగుల సమాచారంతో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు పథకం ప్రకారం అతణ్ని చుట్టుముట్టారు. మొదట గాల్లోకి కాల్పులు జరిపి లొంగిపోవాలని కోరారు. కానీ రుక్సాన్ వినకుండా కాల్పులు జరిపాడు. ఓ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ తుపాకీ జామ్‌ అయింది. విషయం రుక్సార్‌కు తెలిస్తే మరింత రెచ్చిపోయి కాల్పులు జరిపేస్తాడని ఎస్ఐ పక్కనున్న కానిస్టేబుల్ భావించాడు. వెంటనే ఎస్ఐ పక్కన నుంచుని తూటాలు గాల్లోకి దూసుకెళ్లినట్టు ధన్ ధన్ అని మిమిక్రీ చేశాడు. చంపేయ్, కాల్చేయ్ అని కూడా ఇద్దరూ అరిచారు. అవి నిజమైన కాల్పులే అనుకుని రుక్సార్ భావించాడు. ఆత్మరక్షణ కోసం ఒకపక్క కాల్పులు జరుపుతూ మరోపక్క పారిపోసాగాడు. మిగతా పోలీసులు అతని కాలిపై కాల్చి అరెస్టు చేశారు. సదరు కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని పోలీసులు అధికారులు మెచ్చుకుంటున్నారు.