ఆఫీస్‌లో బిన్ లాడెన్ ఫోటో ఉంచిన యూపీ అధికారి - MicTv.in - Telugu News
mictv telugu

ఆఫీస్‌లో బిన్ లాడెన్ ఫోటో ఉంచిన యూపీ అధికారి

June 2, 2022

అల్ ఖైదా ఉగ్రవాది.. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతలో ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను ‘ప్రపంచపు ఉత్తమ ఇంజినీర్‌’ అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కొనియాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. అంతే కాదు తన కార్యాలయంలో ఏకంగా లాడెన్ ఫోటోను పెట్టుకొవడం గమనార్హం. ఈ విషయం వైరల్ కావడంతో సదరు అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

యూపీలోని దక్షిణాంచల్‌ విద్యుత్‌ విత్రాన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ లో సబ్‌-డివిజినల్‌ ఆఫీసర్‌ గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర ప్రకాశ్‌ గౌతమ్‌.. ఒసామా బిన్‌ లాడెన్‌ ఫొటోను తన ఆఫీసులో పెట్టుకుని ‘గౌరవనీయులైన ఒసామా బిన్‌ లాడెన్‌, ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్‌ ఇంజినీర్‌’ అంటూ ఫోటో కింద రాసుకున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారుల చెవిలో పడటంతో రవీంద్ర ప్రకాష్ గౌతమ్ ను సస్పెండ్ చేశారు. కార్యాలయం నుంచి ఫోటోను తొలగించారు. ఈ పనికి పాల్పడ్డ గౌతమ్ ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా రవీంద్ర ప్రకాష్ గౌతమ్ తగ్గలేదు. తన చర్యలను సమర్థించుకున్నాడు. ఫోటో ఎవరిదైనా కావచ్చు..ఒసామా ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్ అని చెప్పుకొచ్చాడు.