కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు షాప్ ఓనర్లు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఫెస్టివల్ ఆఫర్ , ఇయర్ ఎండ్ ఆఫర్, క్లియరెన్స్ సేల్.. అని ఏవేవో పేర్లతో బిజినెస్ చేస్తుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మొబైల్ షాప్ ఓనర్.. తన షాప్‌లో స్మార్ట్ ఫోన్లపై విచిత్రమైన ఆఫర్ ఎనౌన్స్ చేశాడు. తన షాప్‌లో కొనే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌కి రెండు బీర్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించడంతో జనం భారీగా పోటెత్తారు. షాప్ ముందు క్యూ కట్టిన జనంతో అక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది.
భదోహిలో చౌరీ రోడ్‌లో మొబైల్ ఫోన్ దుకాణం నడుపుతున్న రాజేష్ మౌర్య.. ఈ ఆఫర్ ప్రకటించాడు. మార్చి 3 నుంచి 7వ తేది వరకే ఈ స్పెషల్ ఆఫర్ అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కస్టమర్లకు పోస్టర్లు, యాడ్‌లు, పాంప్లేట్ల ద్వారా తెలియజేశాడు. ఆఫర్ బాగానే వర్కవుట్ అయింది కానీ.. ఆదివారం(5 వ తేది) సెలవు రోజు కావడంతో చాలామంది.. ఆ షాప్ ముందు భారీగా గుమిగూడారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ఇంకేముంది సమాచారం అందుకున్న పోలీసులు ఆ షాపు వద్దకు చేరుకున్నారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం సాయంత్రం, పోలీసులు దుకాణం వద్ద గుమిగూడిన జనాన్ని చెదరగొట్టారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 151 (ప్రజా శాంతికి భంగం కలిగించడం) కింద మౌర్యను అరెస్టు చేశారు. అతని దుకాణాన్ని కూడా సీల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.