ఆంధ్రప్రదేశ్లో సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. సభా నాయకుడి హోదాలో సీఎం జగన్, సభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విపక్షటీడీపీ తరఫున సభలో ఆ పార్టీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాడులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్ని రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్న విషయంపై చర్చ జరిపారు. ఇరువర్గాల వాదనల మేరకు ఈ నెల 25 వరకు సమావేశాలను కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించారు. సెలవులు మినహా మొత్తం 13 రోజుల పాటు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 11న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం 85 అజెండా అంశాలపై చర్చించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ ఏపీ అధికార భాష చట్టం-1966 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే విదేశీ మద్యం నియంత్రణ చట్టం, హిందూ ధార్మిక సంస్థల చట్టం, తితిదేలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం చట్ట సవరణలకు అంగీకారం తెలిపింది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అంగీకరించింది.