అదనపు కట్నం తీసుకురాలేదని బంధువులతో కలిసి భార్యపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు ఓ భర్త. ఆ తర్వాత బాధితురాలికి ‘త్రిపుల్ తలాక్’ చెప్పి విడాకులు తీసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ గోండా జిల్లాలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన మహ్మద్ అద్నాన్కు కొన్నేళ్ల క్రితం బాధితురాలితో వివాహమైంది. అదనపు కట్నం కోసం తరచుగా ఆమెను వేధించేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. కొన్ని రోజుల నుంచి అద్నాన్ పెడుతున్న హింసలు తట్టుకోలేక.. బాధితురాలు తన పుట్టింటికి వెళ్లి ఉంటోంది. అయితే మంగళవారం అద్నాన్, అతని బంధువుతో కలసి తన అత్తమామల ఇంటికి వెళ్లి… ఒంటరిగా ఉన్న భార్యపై అత్యాచారం చేశాడు. తర్వాత ఆమెను కొట్టి త్రిపుల్ తలాక్ చెప్పి చట్టవిరుద్ధంగా విడాకులు ప్రకటించాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు అద్నాన్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతడి బంధువుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.