UP youth kills minor for not accepting friend request on Facebook
mictv telugu

ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని పొడిచేశాడు..

June 20, 2022

ఫేస్‌బుక్‌లో తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని ఓ యువకుడు బాలికపై ఉన్మాదానికి తెగబడ్డాడు. బాలికతో పాటు ఆమె తల్లిపై కూడా సైకోలా మారి కత్తితో దాడి చేశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా.. ఆమె తల్లి, ఆ యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన యూపీలోని మథుర హైవే పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా బోహ్రా గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అజయ్ కౌషల్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్లా బోహ్రా అనే గ్రామంలో తేజ్‌వీర్ సింగ్ అనే వ్యక్తి హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య, 16 ఏళ్ల వయసున్న కూతురు గ్రామంలోనే నివసిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం తేజ్‌వీర్ సింగ్ ఇంట్లో లేని సమయంలో.. ముజఫానగర్‌కు చెందిన రవి అనే వ్యక్తి.. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చే వంకతో వారి ఇంటికి వెళ్లాడు. అతడి పిలుపుతో బాలిక బయటకు రాగానే ఆమెకు శుభలేఖ ఇస్తున్నట్టు నటిస్తూ ఆ వెడ్డింగ్ కార్డులో కనిపించకుండా దాచిన కత్తి తీసి ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. బాధతో ఆమె అరుపులు, కేకలు వేయడంతో ఆ బాలిక తల్లి సునీత కూడా కూతురి దగ్గరకు వెళ్లింది. ఆ బాలిక తల్లిపై కూడా రవి కత్తితో దాడికి యత్నించాడు.

ఈ ఘటనలో సదరు బాలిక తీవ్రంగా గాయపడి రక్తస్రావం కావడంతో స్పాట్‌లోనే చనిపోయిందని డీసీపీ ధర్మేంద్ర చౌహాన్ తెలిపారు. బాలిక తల్లి సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రిలో నిందితుడు రవికి కూడా చికిత్స అందిస్తున్నారు. నిందితుడు రవికి, ఆ బాలికకు ఇంతకు ముందు పరిచయం ఉందని, ఆ పరిచయంతోనే బాలికకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేయగా.. ఆమె దానిని యాక్సెప్ట్ చేయలేదనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.