ఉపాసన కొణిదెల మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలిగా, రాం చరణ్ భార్యగా గుర్తింపు రాకముందే అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్‌గా తన స్థాయిలో ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో వైవిధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సామాజిక సేవలోనూ తగినంత గుర్తింపు తెచ్చుకుంది. రాంచరణ్‌ను వివాహం చేసుకున్నా తన కార్యక్రమాలను పెంచుతూ వచ్చిందే తప్ప తగ్గించలేదు. అయితే పెళ్లై పదేళ్లయినా వారికి ఇంకా పిల్లలు కలగకపోవడంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తన సమస్యను సద్గురు జగ్గీవాసుదేవ్ గారితో చెప్పుకొంది ఉపాసన. ఓ కార్యక్రమంలో వీరు పాల్గొనగా, తనను పిల్లలను ఎందుకు కనట్లేదని అందరూ అడుగుతున్నారని, మీ సలహా ఏంటని ఉపాసన సద్గురును అడిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ ‘నన్నడిగితే మీరు పిల్లలను కనకపోవడం బెటర్. ఎందుకుంటే ఇప్పటికే భూమ్మీద మనుషులు ఎక్కువైపోయారు. పిల్లలను కనకూడదని నిర్ణయించుకునే జంటలకు నేను అవార్డునివ్వాలి. అదే నువ్వు ఆడపులివై ఉంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలను కనమని చెప్పేవాడిని. ఎందుకంటే పులులు భూమ్మీద అంతరించే జాబితాలో ఉన్నాయి. వాటి సంతతి పెంచడానికి మనం కృషి చేయాలి. అలాగే ఏపనీ లేకుండా ఖాళీగా ఉన్నవారిలో హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దాంతో వారు పిల్లలను కనడానికి మొగ్గు చూపుతారు. పనిచేయాలనే ఆలోచన ఉన్నవారికి పిల్లలను కనాలనే ఆలోచన రాదు. మనం ఈ ప్రపంచానికి ఏదైనా మేలు చేయాలనుకుంటే జస్ట్ పిల్లలను కనకపోతే చాలు’ అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. దీంతో వెంటనే ఉపాసన ‘మీరిలా చెప్పారు కదా. మీకు మా అమ్మగారు, అత్తగారి నుంచి ఫోన్లు వస్తాయి చూడండి’ అంటూ నవ్వేసింది.