UPI transactions fell drastically when Kohli was batting
mictv telugu

కోహ్లీ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన యూపీఐ లావాదేవీలు

October 24, 2022

నరాలు తెగే ఉత్కంఠతో ఆదివారం సాగిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. దాయాదుల మధ్య పోరు కావడంతో దేశమంతా ఈ మ్యాచుపై దృష్టి కేంద్రీకరించింది. సాధారణంగా దీపావళి పండుగకు ముందు రోజు వచ్చిన ఆదివారం కావడంతో షాపింగ్ జోరుగా సాగుతోంది.

కానీ, షాపింగ్ కంటే మాకు మ్యాచే ముఖ్యమని భావించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అప్పటివరకు సాధారణంగా అవుతున్న యూపీఐ లావాదేవీలు ఒక్కసారిగా పడిపోయాయి. తర్వాత భారత్ బ్యాటింగ్‌కి దిగినప్పుడు కొంత పుంజుకున్నా.. చివర్లో కోహ్లీ విరుచుకుపడడంతో ప్రేక్షకులు గుడ్లప్పగించి చూశారు. ఈ సమయంలో ట్రాన్సాక్షన్స్ మరీ దారుణంగా పడిపోవడం గమనార్హం. ఈ వివరాలతో కూడిన సూచికను మ్యాక్స్ లైఫ్‌లో చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్‌గా పని చేసే మిహిర్ వోరా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఆన్ లైన్ షాపింగ్ పూర్తిగా తగ్గిపోయింది. లావాదేవీలు నిలిచిపోయాయి. మ్యాచ్ అయిపోగానే మళ్లీ యథావిధిగా కొనుగోళ్లు సాగాయి. ఈ ఒక్క దెబ్బ చాలు కోహ్లీ మేనియా గురించి చెప్పడానికి. గతంలో సచిన్ టెండూల్కర్ ఆడేటప్పుడు ఇలాంటి తార్కాణాలు కనపడేవి. మళ్లీ ఇన్నాళ్లకు కోహ్లీ రూపంలో ఇలాంటి ఉదాహరణలు వింటున్నామని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో జనాలు పనులన్నీ ఆపేసి మ్యాచ్ చూడడం వల్ల దేశ జీడీపీ కూడా ఎంతో కొంత ప్రభావితమయ్యే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.