కర్ణాటక ప్రభుత్వం భద్ర నదిపై నిర్మిస్తున్న అప్పర్ భద్ర భారీ ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పోలవరంతోపాటు ఏపీ, తెలంగాణల్లోని ఏ ప్రాజెక్టుకూ పైసా విదిల్చని కేంద్రం తన తాజా బడ్జెట్‌లో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5300 కోట్లు కేటాయించడం విమర్శలకు దారితీసింది. ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి కాబట్టి ఓట్ల కోసం మోదీ ప్రభుత్వం డబ్బులు కేటాయించిందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. అయితే అది కరువు ప్రాంతమని, ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ హయాం నుంచీ సాగుతున్నవేనని కన్నడిగులు అంటున్నారు. తమకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తామని తెలుగు రాష్ట్రాలు అంటున్నాయి. కర్ణాటక ఇప్పటికే తనకు కేటాయించిన నీటికంటే ఎక్కువ వాడుకుంటోందని, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉండడంతో తమకు అన్యాయం చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
తుంగభద్రకు సమస్య..
దక్షిణ తెలంగాణ, రాయలసీమలకు కీలకమైన తుంగ భద్ర ప్రాజెక్టుకు భద్ర నీరు కీలకం. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే తుంగభద్రకు నీళ్లు తగ్గుతాయి. ఫలితంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టు ఎండిపోయే ప్రమాదముంది. తెలుగు రాష్ట్రాల జీవనాడుల్లో ఒకటైన కృష్ణా బేసిన్‌లో నీటి కొరత తలెత్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాముల ఇన్ ఫ్లోపై ప్రభావం పడుతుంది. తొలుత తుంగభద్రకు ఇన్ ఫ్లో తగ్గుతుంది. ఫలితంగా పోతిరెడ్డిపాటు, హెచ్ఎల్సీ, రాజోలిబండ వంటి తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల్లో నీరు తగ్గుతుంది. సిద్ధేశ్వరం, గండ్రేవుల వంటి ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టుల సంగతి చెప్పనవసరం లేదు.
అప్పర్ భద్ర ఎందుకు?
మధ్య కర్ణాటకలోని తుమకూరు, దావణగెరె, చిత్రదుర్గ, చిక్కమగళూరు జిల్లాల్లో సాగు, తాగు నీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. తుంగ నది నుంచి 17.4 టీఎంసీలను, భద్ర నుంచి భద్ర 29.9 టీఎంసీల జలాలను ప్రాజెక్టుకు మళ్లిస్తారు. 2,25,515 హెక్టార్లకు నీరు అందుతుంది. 2008లో ప్రాజెక్టు పనులు ప్రారంభయ్యాయి. ఇప్పటికి రూ. 4,800 కోట్లు చేయగా, మొత్తం బడ్జెట 21 వేల కోట్లకుపైగానే.