లోన్ ఇవ్వలేని బ్యాంకుకు తుపాకీతో వచ్చి.. - MicTv.in - Telugu News
mictv telugu

లోన్ ఇవ్వలేని బ్యాంకుకు తుపాకీతో వచ్చి..

December 4, 2019

ఈమధ్య జనాలు బాగా సహనం నశించిపోతున్నారు. మునుపటిలా పలు కార్యాలయాల్లో తమ పనులు కాకపోతే నోరు మూసుకుని వెనక్కి వెళ్లడంలేదు. ఎలా చేయరని గట్టిగా నిలదీసి అడుగుతున్నారు. అలా అడగడం వరకైతే సరేగానీ, శృతిమించితేనే అసలు సమస్య వచ్చేది. లోన్ రాలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి బ్యాంక్‌లో చెలరేగిపోయాడు. కత్తి, గన్నుతో బ్యాంక్‌లో హల్‌చల్‌ చేశాడు. దీంతో ఉద్యోగుల గుండెలు అదిరిపోయాయి. బుధవారం కోయంబత్తూర్‌లోని కెనరా బ్యాంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెట్రివేల్‌ అనే వ్యక్తి మోటార్ తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. మార్చి నెలలో కోటి రూపాయల లోన్ కోసం బ్యాంక్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. తన స్థలాన్ని తనఖా పెట్టి లోన్ పొందాలి అనుకున్నాడు. లోన్ కోసం మధ్యవర్తిని కూడా పెట్టుకున్నాడు. అతనికి మూడు లక్షల రూపాయలు కూడా ఇచ్చాడని తెలుస్తోంది.

Loan Application..

అయితే అనూహ్యంగా అతనికి బ్యాంక్ లోన్ ఇవ్వనని చేతులు ఎత్తేసింది. దీంతో ఆగ్రహానికి గురయ్యాడు వెట్రివేల్. ఆ కోపంలో కత్తి, గన్ను పట్టుకుని బ్యాంక్‌కు వెళ్లాడు. మేనేజర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులపై కూడా దాడి చేశాడు. అక్కడున్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. వెట్రివేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘వెట్రివేల్ లోన్ తిరస్కరించాలనే నిర్ణయాన్ని ప్రధాన కార్యాలయం తీసుకుంది. బ్రాంచ్ ఆఫీసుకు దీనితో ఎటువంటి సంబంధం లేదు’ అని స్పష్టంచేశారు. కాగా, లోన్ రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని వెట్రివేల్ చెప్పినట్టు సమాచారం.