ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ: జగన్

June 17, 2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ఓ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ, జగన్ సర్కార్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అన్ని జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఉర్ధూ భాషను అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించిన మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. ”ఉర్దూ ఓ మతానికి సంబంధించిన భాష కాదు. తెలుగుతోపాటు ఉర్దూకు కూడా సమాన హోదా లభించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉర్దూ ఇప్పటికే రెండో అధికారిక భాషగా కొనసాగుతోంది. ఉర్దూను అధికారిక భాషగా గుర్తించడంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగుతోపాటు ఉర్దూలో కూడా కొనసాగుతాయి” అని ఆయన అన్నారు.

మరోపక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. ఈ క్రమంలో మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన జగన్‌.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టైంది. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.