టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైన తర్వాత పూర్తిగా దగ్ధమైయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషభ్ పంత్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా చేసిన ఓ ట్వీట్ ఆసక్తి కరంగా మారింది. ‘మీరు, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేసిన ఊర్వశి.. ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేసిందో తెలియక నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. ఆ కామెంట్‌కు ఎవరిని ట్యాగ్ చేయకపోవడం, ఎలాంటి హ్యాష్‌ట్యాగ్ జతచేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. దాంతో, నెటిజన్లు ఎవరికి తోచినట్టు వారు కామెంట్ చేస్తున్నారు. మీమ్స్ జతచేస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో రిషబ్, ఊర్వశి ల మధ్య మాటల యుద్ధం కొనసాగిన క్రమంలో.. రిషభ్నుద్దేశించే ఊర్వశి ఆ ట్వీట్ చేశారని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరికొందరు ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మరణం పట్ల సానుభూతి తెలిపేందుకు ట్వీట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ కాదని.. ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు పీలే .. మృతి పట్ల సంతాపం తెలిపారంటూ ఇంకొందరు ఊహించుకుంటున్నారు.