కొత్త జంటలు ఏకాంతంగా హాయిగా గడపడానికి హనీమూన్ వెళ్తాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ తతంగం ఇప్పుడు అన్నీచోట్లా జోరుగానే సాగుతుంది. డబ్బున్నోళ్లు విదేశాలకు కూడా చెక్కేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల కొన్ని జంటలు ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నాయి. అమెరికాకు చెందిన ఓ హనీమూన్ జంట చావు అంచువరకు వెళ్లొచ్చింది. తమకు ఆ దుస్థితి కల్పించిన టూరింగ్ ఏజెన్సీపై కోర్టుకు కూడా ఎక్కింది. తమ హనీమూన్ మూడ్ పాడైనందుకు రూ. 40 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతోంది.
కాలిఫోర్నియాకు చెందిన ఎలిజబెత్ వెబ్‌స్టెర్, అలెగ్జాండర్ బర్కల్‌ల కథ ఇది. రెండేళ్ల కిందట పెళ్లాడిన వీరు హనీమూన్ కోసం హవాయి దీవుల్లోని లనాయ్ దీవికి వెళ్లాలనుకున్నారు. టూర్ ఏజెన్సీ సెయిల్ మౌయీ సాయంతో ఆ ఏడాది సెప్టెంబర్ నెలలో చెక్కేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లడానికి డైవింగ్ మాస్కులు, స్విమ్ సూట్ ధరించి ‘స్నొర్కెలింగ్’కు వెళ్లారు. వీరితోపాటు మొత్తం 44 మందితో వెళ్లిన పడవ సముద్రంలో ఓ చోట ఆగింది. టూరిస్టులో సముంద్రం అడుగున ఈదులాడారు. అయితే ఎప్పుడు మళ్లీ పడవలోకి రావాలి వంటి టైమింగ్స్ చెప్పకపోవడంతో కొత్త జంట నీటిలో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపేసింది. నీటిలో పోటు ఎక్కువ కావడంతో పడవను చేరుకోవాలనుకున్నారు. పదిహేను నిమిషాలు ఈదుతూ పైకి రాగా పడవ అప్పటికే చాలా దూరం వెళ్లిపోయింది. చేసేదేం లేక ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని కుప్పకూలిపోయారు. దీవుల్లోని ఓ స్థానికుడు వాళ్లను కాపాడాడు. ఇదంత టూర్ ఏజెన్సీ నిర్వాకం వల్లే జరిగిందని తమకు జంట కోర్టుకెక్కింది. తమకు 40 కోట్లు చెల్లించాలని కోరుతోంది.