అమెరికాలో నివసిస్తున్న భారత టెకీలకు ఉపయోగపడేలా అక్కడి ప్రభుత్వం వీసా నిబంధనల్లో కీలక మార్పుకు శ్రీకారం చుడుతోంది. వీసాల పునరుద్ధరణకు సంబంధించి 2004 వరకు అమలైన ‘డొమెస్టిక్ వీసా రీవ్యాలిడేషన్’ విధానాన్ని తిరిగి కొనసాగించనుంది. దీంతో హెచ్-1బీ, ఎల్1 వీసా కలిగి ఉన్న భారతీయులకు మేలు జరుగుతుంది. ఇప్పటివరకు పై వీసాలు కలిగి ఉన్నవారు రెన్యువల్ కోసం సొంత దేశానికి వెళ్లాల్సి వచ్చేది. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడగింపుపై స్టాంపింగ్ చేయించుకొని తిరిగి అమెరికాలోకి ప్రవేశించేవారు. అయితే కొన్నిసార్లు స్టాంపింగ్‌కి నెలల సమయం పడుతోంది. అదే అమెరికాలో ఉంటూనే స్టాంపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఈ ఏడాది చివరి నాటికి పునరుద్ధరిస్తున్నట్టు స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి తెలిపారు. అటు అమెరికా వీసాల కోసం భారత్‌లో పేరుకుపోయిన అప్లికేషన్లపై ఆ దేశ విదేశాంగ శాఖ మరో విధానాన్ని అమలు చేస్తోంది. ఇతర దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లోనూ వీసాల పరిశీలన చేయడానికి సిద్ధమైంది.